సందర్శన.. సమీక్ష | - | Sakshi
Sakshi News home page

సందర్శన.. సమీక్ష

Jul 14 2026 1:18 AM | Updated on Jul 14 2026 1:18 AM

ములుగు/కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టగంగారంలో ఉన్న దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకాన్ని సోమవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్‌ బ్యారేజీ వద్ద ఉన్న హెలిపాడ్‌ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. వారికి కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, ఎస్పీ రామ్‌నాథ్‌ కేకన్‌, పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రత్యేక కాన్వాయ్‌ ద్వారా మంత్రులు సమ్మక్క సాగర్‌ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీని పరిశీలించారు. నీటి స్టోరేజీ, సామర్థ్యం, గేట్ల పనితీరు, ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడినుంచి గట్టలగంగారం పరిధిలోని దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల వద్దకు చేరుకొని పంపింగ్‌ స్టార్టింగ్‌ పాయింట్‌ను పరిశీలించారు. మోటార్ల పనితీరు, మూడు ఫేజ్‌లలో ఎన్ని మోటార్లు ఉన్నాయి.. ప్రస్తుతం ఎన్నింటి ద్వారా నీటిని దిగువకు ఎత్తిపోస్తున్నారని ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు చేరుకొని ఇంజనీరింగ్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులు వారికి ప్రాజెక్టు వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి మాట్లాడారు. దేవాదుల వద్ద ఉన్న పది మోటార్లు నిరంతరం పంపింగ్‌ చేయాలని ఆదేశించారు. దీని పరిధిలోని 22 రిజర్వాయర్‌లను నింపుతామన్నారు. ఈ నీటితో రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును సందర్శించి, ఏడాది వ్యవధిలోనే పూర్తిచేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. లక్ష్య సాధన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. మధ్యాహ్నం 1.31గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగివెళ్లిపోయారు. ఎస్పీ రామ్‌నాథ్‌ కేకన్‌ ఐపీఎస్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ భద్రత వలయంలో మంత్రుల పర్యటన సాగింది. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్‌, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్‌ నాగరాజు, యశస్వినిరెడ్డి, అదనపు కలెక్టర్లు మహేందర్‌ జి.సంపత్‌రావు, ములుగు డీఎస్పీ రవీందర్‌, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌ బట్టు, ములుగు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కళ్యాణి, ఈఎన్‌సీ జనరల్‌ రమేశ్‌ బాబు, ఇంజనీరింగ్‌ అధికారులు ధర్మ, మోహన్‌రావు, శరత్‌బాబు, ప్రవీణ్‌ కుమార్‌, స్థానిక తహసీల్దార్‌ సయ్యద్‌ సర్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

దేవాదుల నీటితో 22 రిజర్వాయర్‌లను పూర్తిగా నింపుతాం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు

ఉత్తమ్‌, పొంగులేటి

సమ్మక్క సాగర్‌ బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టు పరిశీలన

అధికారులతో సమీక్ష, నీటి సామర్థ్యం, మోటార్ల పనితీరుపై ఆరా

సాగునీరందిస్తామని రైతులకు హామీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement