కథలాపూర్: మండలంలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని చింతకుంటలో రూ.6 లక్షలతో నిర్మించిన బతుకమ్మ ఘాట్‌ను ప్రారంభించారు. లక్కాకుల చెరువును ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. సూరమ్మ ప్రాజెక్టు, వరదకాలువ, రాళ్లవాగు ప్రాజెక్టుల నుంచి లక్కాకుల చెరువు నింపేలా అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటిపారుదల శాఖ ఎస్‌ఈ సంతు ప్రకాశ్‌రావు, సర్పంచ్ నాగం భూమయ్య, సింగిల్‌విండో చైర్మన్లు గడ్డం స్వామిరెడ్డి, ఎండీ.ముబీన్, డైరెక్టర్ లోక నర్సారెడ్డి, చెదలు సత్యనారాయణ, వంగ మహేశ్, వేముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ వేధిస్తున్నాడు
మాది జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట(గోపాల్‌రావుపేట). గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 204/1/1/1/1/1/1/1/1/1లో నా భార్య ప్యాట రజిత పేరిట ప్లాట్ కొని పంచాయతీ అనుమతితో ఇల్లు నిర్మిస్తున్నాను. స్లాబ్ లెవల్ వరకు పూర్తయ్యింది. అప్పటినుంచి సర్పంచ్ వేధిస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శితో నోటీసు ఇప్పించాడు. పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు నిర్మాణంలో అతిక్రమణలు జరగలేదని నిర్ధారించినా నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నడు. సర్పంచ్‌పై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయండి. – కర్రె శ్రీధర్, తిప్పన్నపేట
తహసీల్దార్‌పై చర్యలు తీసుకోండి
మాకు భూపతిపూర్ శివారులో సర్వేనంబర్ 58/1లో 1980లో అప్పటి ప్రభుత్వం 2. 20 ఎకరాల అసైన్‌మెంట్ భూమికి పట్టా ఇచ్చింది. ఇప్పటివరకు నా స్వాధీనంలోనే ఉంది. ఎల్‌ఆర్‌పీ ద్వారా ఫోర్జరీ సంతకాలు, తప్పుడు పత్రాలతో పాల్త్యా లత భర్త లింగరెడ్డి, (లింగాపూర్), బూక్య కమల భర్త నర్సయ్య ఒడ్డెలింగాపూర్ పేరిట పట్టా పాస్‌బుక్కులు జారీ చేశారు. ఆ పట్టాను రద్దు చేయాలని కలెక్టర్, ఆర్డీవో ఆదేశించినా రాయికల్ తహసీల్దార్ అమలు చేయడం లేదు. – జీకూరి శ్రీహరి, భూపతిపూర్, రాయికల్
చెరువును పునరుద్ధరించండి
పొలాస శివారులోని అల్లంకుంట చెరువుకు సంబంధించిన పదెకరాల భూమి కబ్జాకు గురికావడంతో చెరువు కింద ఉన్న సుమారు 200ఎకరాలకు నీరందక ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో వరదలతో పొలాలు కొట్టుకుపోతున్నాయి. చెరువు తూములు తొలగించి వ్యవసాయ భూములుగా మార్చడంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. చెరువు కబ్జాదారులపై చర్యలు తీసుకోండి. – లైశెట్టి విజయ్, తిప్పన్నపేట


