రాజారాంపల్లిలో యువకుని దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

రాజారాంపల్లిలో యువకుని దారుణ హత్య

Oct 20 2026 12:14 AM | Updated on Oct 20 2026 12:14 AM

వెల్గటూర్‌: పాత కక్షలతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన బొంతు మల్ల య్య, శివరాత్రి మల్లేశ్‌ కుటుంబాలు వలస వచ్చి.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలకేంద్రంలో మల్లయ్య కుటుంబం, జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో మల్లేశ్‌ కుటుంబం నివాసం ఉంటోంది. మల్లయ్య భార్యతో.. మల్లేశ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరు కుటుంబాల మధ్య కొద్దిరోజులుగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. మల్లయ్య కుమారుడు సంతోష్‌ తన తల్లితో వివాహేతర సంబంధం విషయమై మల్లేశ్‌ను ప్రశ్నించాడు. దీంతో సంతోష్‌పై మల్లేష్‌ పగ పెంచుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి సంతోష్‌ (17) ఒంటరిగా రాజారాంపల్లికి రాగా పాతకక్షలతో శివరాత్రి మల్లేష్‌ ప్రోత్సాహంతో అతని కొడుకు అనిల్‌ సంతోష్‌పై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్‌ కుమార్‌ తెలిపారు.

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు

జగిత్యాలక్రైం/కొడిమ్యాల: వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం కొడిమ్యాల మండలం శనివారంపేటకు చెందిన విశాల్‌ (27), ఉదయ్‌(30) ద్విచక్ర వాహనంపై సూరంపేట నుంచి కొడిమ్యాలకు వస్తున్నారు. సూరంపేట శివారు మూల మలుపు వద్ద చెట్టును ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌ తరలించినట్లు తెల్సింది. అలాగే జగిత్యాల రూరల్‌ మండలం తాటిపల్లి శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మెట్‌పల్లికి చెందిన యువకుడు ద్విచక్ర వాహనంపై అతివేగంగా వచ్చి మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. గాయపడిన వారిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని పురాణిపేటకు చెందిన బోరుగల్ల లక్ష్మణ్‌ (54) చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. లక్ష్మణ్‌ ఈనెల 17న సాయంత్రం ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కిరణ్‌ తెలిపారు.

బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

వెల్గటూర్‌: బావిలో దూకి వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఎండపల్లి మండలం గుల్లకోటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బైరి వెంకటమ్మ (85) ఏడాదిగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెంది వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుమారుడు శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement