జగిత్యాల: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 57 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలన్నారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, డీఆర్వో ప్రసాద్ పాల్గొన్నారు.
వాలంటీర్లకు పారితోషికం ఇవ్వాలి
జిల్లా పరిధిలో డిజిటల్ క్రాప్ సర్వేలో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లకు పారితోషికం, భద్రత, పీపీఈ కిట్లు కల్పించాలి. ప్రతి సర్వే నంబరుకు రూ.15 పారితోషికం కేటాయించాలి. రక్షణ చర్యలు కల్పించాలి.
– డిజిటల్ క్రాప్ సర్వే వాలంటీర్లు
పర్మినెంట్ డిజబిలిటీ సర్టిఫికెట్ ఇవ్వాలి
స్పైనల్‌కార్డ్ సమస్యతో వైకల్యం ఉంది. ఏ పనీ చేయలేకపోతున్నాను. సదరెం సర్టిఫికెట్ పరిశీలించి పర్మినెంట్ డిజబిలిటి సర్టిఫికెట్ ఇవ్వాలి. స్పైనల్ సర్జరీ జరిగిన అనంతరం రెండు కాళ్లు కింది భాగంలో పనిచేయడం లేదు. ఏ పని చేసుకోలేకపోతున్నాను.
– గంగయ్య, సోమన్‌పల్లి
భూమి కబ్జా చేశారు
మల్యాల మండలం నూకపల్లిలో సర్వే నంబరు 463లో ఉన్న నా సొంత భూమిని కబ్జా చేశారు. అధికారులకు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అధికారులు స్పందించి నా భూమి నాకు ఇప్పించేలా చూడాలి.
– నారాయణ, నూకపల్లి, మల్యాల మండలం
క్వార్టర్లను ప్రజా అవసరాలకు వినియోగించాలి
శ్రీరామ థియేటర్ సమీపం నుంచి టీవీ స్టేషన్‌కు వెళ్లే మార్గంలో శిథిలావస్థకు చేరుకున్న మున్సిపల్ క్వార్టర్లను ప్రజా అవసరాలకు వినియోగించాలి. చాలా కాలంగా వినియోగంలో లేకపోవడంతో క్వా ర్టర్లు శిథిలావస్థకు చేరాయి. భవనాలు ప్రమాదకరంగా మారడంతోపాటు, అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మారాయి.
– అరవ లక్ష్మీ, కౌన్సిలర్
స్కూల్‌కు స్థల ఎంపిక సరికాదు
గ్రామ శివారు మోరపల్లి గుట్టలోని ఎనిమిది ఎకరాలు, తాటిపల్లి గుట్టలోని 17 ఎకరాలు కలిపి మొత్తం 25 ఎకరాల గుట్టను స్కూల్ నిర్మాణం కోసం చదును చేస్తున్నారు. స్కూల్ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నాం. అయితే స్థల ఎంపికను మాత్రం వ్యతిరేకిస్తున్నాం. 50 అడుగుల ఎత్తులో చెట్లు, రాళ్లు, రప్పలను పొక్లెయిన్‌తో తొలగించి బ్లాస్టింగ్ మిషన్లతో రాళ్లను పగులగొట్టడం ద్వారా రూ.కోట్లు ఖర్చవుతుంది. ఆ నిధులతో రోడ్‌ఫేసింగ్‌లో 25 ఎకరాల భూమి వస్తుంది. గుట్టను తొలగించడం ద్వారా లక్షల చెట్లు నరకాల్సి వస్తుంది. ఇది ప్రకృతికి తీరని హాని. భావితరాల భవిష్యత్‌కు స్కూల్‌ను సమతుల ప్రదేశానికి తరలించాలి.
– మోరపల్లి, తాటిపల్లి గ్రామస్తులు


