సన్నద్ధమైన యూనియన్లు కూటములతో కొత్త సమీకరణలు టీఎంయూ పోటీపై అనిశ్చితి కరీంనగర్ రీజియన్‌లో వేడెక్కిన పోరు 11 డిపోలు.. 2,830 మంది ఓటర్లు
కరీంనగర్‌టౌన్: పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీజీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కార్మిక సంఘాల్లో సందడి మొదలైంది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఒకవైపు టీఎంయూ పోటీపై అనిశ్చితి నెలకొనగా.. మరోవైపు యూనియన్ల మధ్య పొత్తులు, కూటములు కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోరు ఆసక్తికరంగా మారే అవకాశముంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు యూనియన్లు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. చివరకు ఏ సంఘానికి కార్మికుల మద్దతు లభిస్తుందన్నది అక్టోబర్ 17న వెలువడే ఫలితాలతో తేలనుంది.
2,830 మంది ఓటర్లు
కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్–1, కరీంనగర్–2, హుస్నాబాద్, హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, వేములవాడ, మంథని, గోదావరిఖని, సిరిసిల్ల డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,830 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,340 మంది డ్రైవర్లు, 955 మంది కండక్టర్లు, 376 మంది మెయింటెనెన్స్ సిబ్బంది, 132 మంది ఎగ్జిక్యూటివ్ సిబ్బంది, 19 మంది రీజియన్ కార్యాలయ ఉద్యోగులు, నలుగురు మెడికల్, ముగ్గురు ఫైనాన్స్, ఒకరు స్టోర్ విభాగానికి చెందినవారు ఉన్నారు.
టీఎంయూ దారెటు?
2016లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ రీజియన్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) విజయం సాధించింది. ఈసారి ఆ సంఘం రాష్ట్ర నాయకత్వం రెండు వర్గాలుగా విడిపోవడం, వివాదం కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల బరిలో టీఎంయూ పోటీపై అనిశ్చితి నెలకొంది. లేబర్ కమిషన్ నుంచి పోటీకి అనుమతి విషయంలోనూ సమస్యలు ఎదురయ్యాయి. రీజియన్‌లో బలమైన సభ్యత్వం ఉన్న టీఎంయూ పోటీకి దూరమైతే.. ఇతర సంఘాలకు మద్దతు ఇవ్వడం ద్వారా తమ బలాన్ని చాటుకునేందుకు ఆ సంఘం నాయకులు వ్యూహా లు రచిస్తున్నట్లు సమాచారం. జేఏసీలో కీలకంగా వ్యవహరించిన టీఎంయూ, ఎంప్లాయీస్ యూ నియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు సమావేశాలు నిర్వహిస్తూ డిపోల్లో గేట్ మీటింగ్‌లు చేపడుతున్నారు. ఎస్‌డబ్ల్యూయూ(ఐఎన్‌టీయూసీ)తో పోటీకి సమాయత్తమవుతున్నట్లు తెలు స్తోంది. గుర్తులు కేటాయించిన అనంతరం మరి కొన్ని యూనియన్ల మధ్య పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉందని సంఘాల నాయకులు చెబుతున్నారు.
షెడ్యూల్ ఇలా
ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోటీ చేసేందుకు యూనియన్ల నుంచి సమ్మతి పత్రాలు స్వీకరించారు. మంగళవారం డిపో మేనేజర్ల ద్వారా రిటర్నింగ్ అధికారులకు డ్రాఫ్ట్ అభ్యంతరాలకు ఆహ్వానం, 24న ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 25న తుది ఓటర్ల జాబితా పంపిణీ, 26న గుర్తుల కేటాయింపు జరగనుంది. అదే రోజు తుది ఓటర్ల జాబితాను రిటర్నింగ్ అధికారులు సమర్పించనున్నారు. 29న డమ్మీ బ్యాలెట్ పేపర్ల సమీకరణ, అక్టోబర్ 9న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రహస్య బ్యాలెట్ ద్వారా పోలింగ్, అక్టోబర్ 14, 15న పోస్టల్ బ్యాలెట్, 17న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని కార్మికశాఖ అధికారులు వెల్లడించారు.


