నకిలీ స్టాంపులు, పత్రాలతో అధికారులకే బురిడీ నీటి పన్ను రశీదుతో ఇంటిపన్ను మాయాజాలం పోలీసులను ఆశ్రయించిన పంచాయతీ కార్యదర్శి
గొల్లపల్లి: పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా.. నకిలీ ధ్రువపత్రాలు, స్టాంపులు సృష్టించి ఏకంగా ఇంటినే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘరానా మోసం గొల్లపల్లి మండలంలోని తిరుమలాపూర్ (పీడీ) గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు, కార్యదర్శి తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి నిమిత్తం గ్రామానికి వచ్చిన గొలుసుల రాములు కొన్నేళ్లుగా ప్రభుత్వ స్థలంలో ఇంటి నంబర్ 3–122/2 పేరిట ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్నాడు. ఇటీవల ఆ ఇంటిని గ్రామానికే చెందిన గండికోట లక్ష్మణ్‌కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం పంచాయతీ కార్యదర్శి సంతకం, స్టాంపులతో నకిలీ ధ్రువీకరణ పత్రం, ఇంటి పన్ను రశీదును అక్రమంగా సృష్టించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు.
తీగ లాగితే డొంక కదిలింది..
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, కొనుగోలుదారుడు లక్ష్మణ్ ఆ పత్రాలను పంచాయతీ రికార్డుల్లో నమోదు చేసుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి వద్దకు తీసుకొచ్చాడు. ఆ పత్రాలను నిశితంగా పరిశీలించిన కార్యదర్శి వాటిపై ఉన్నది తన సంతకం కాదని, నకిలీ స్టాంపులు వేసి ఫోర్జరీకి పాల్పడ్డారని గుర్తించి షాక్‌కు గురయ్యాడు. అందులో పొందుపరిచిన ఇంటి పన్ను రశీదు నంబర్‌ను రికార్డుల్లో పరిశీలించగా.. అది గతేడాది ఆగస్టులో జారీ చేసిన నీటి పన్ను రశీదు నంబర్‌గా తేలింది. నీటి పన్ను రశీదును ఇంటి పన్ను రశీదుగా మార్చి మోసానికి తెరలేపినట్లు నిర్ధారణ అయ్యింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీకి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్‌కు పాల్పడిన గొలుసుల రాములు, గండికోట లక్ష్మణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శి తిరుపతి గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


