కరీంనగర్: జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన విలువైన స్థలాలు కొన్ని ఆక్రమణకు గురవుతున్నాయి. తాజాగా ప్రభుత్వ, మున్సిపల్ ఆస్తులకు సంబంధించి 3ఎంఐజీ, 1ఎల్‌ఐజీ క్వార్టర్లపై ఆక్రమణలు, అనధికారిక కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలు జరిగినట్లు జిల్లాకేంద్రంలోని విజయపురికి చెందిన కుమార్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ శాఖకు ఫిర్యాదు చేశాడు. మున్సిపల్ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరాడు. దీనికి విజిలెన్స్ శాఖ స్పందించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు లేఖ పంపించారు. ఈ క్రమంలో క్వార్టర్స్ విషయంలో వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ క్వార్టర్స్‌కు సంబంధించి గతంలోనే వారికి అలాట్ చేశారని తెలిసింది. అయితే అలాట్ ఎలా చేశారు..? ఉత్తర్వులు ఎలా జారీ చేశారు..? అనేది తెలియాల్సి ఉంది. పూర్తిస్థాయిలో విచారణ చేయాలని మున్సిపల్ శాఖకు లేఖ పంపించారు. జగిత్యాల రైతుబజార్ సమీపంలో క్వార్టర్స్, భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక భవనంలో ల్యాండ్ అక్వేషన్‌కు సంబంధించిన కార్యాలయం కొనసాగుతోంది. ఇది మున్సిపల్‌దే అయినప్పటికీ ఈ కార్యాలయం కొనసాగడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
విలువైన స్థలాల్లో ఆక్రమణలు
జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన స్థలాలు అనేకం ఆక్రమణలకు గురవుతున్నాయి. కొత్తబస్టాండ్ సమీపంలో ఉద్యానవనం ఆనుకుని ఉన్న మున్సిపల్ స్థలంలో అనేక షెడ్లు వెలిశాయి. ఆ సమీపంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే అత్యధికంగా ఆదాయం లభిస్తుంది. ఆక్రమించుకున్న వారు చిన్నపాటి ఫీజు మున్సిపల్‌కు చెల్లిస్తూ వ్యాపారాలు చేస్తున్నారు. ఇటు స్పోర్ట్స్ అథారిటీకి చెందిన విలువైన భూమిలో అనేక దుకాణ సముదాయాలు, రేకులషెడ్లు వెలిశాయి. ఈ స్పోర్ట్స్ అథారిటీలో నిధులు లేకపోవడంతో అక్కడ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనట్లు తెలిసింది. దీంతో కొందరు రేకులషెడ్లు నిర్మించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బినామీలు అత్యధికంగా ఉన్నారు. కొందరు షెడ్లు వేసి ఏకంగా ఇతరులకు అద్దెకు కూడా ఇస్తున్నారు. పాతబస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లలో చిన్న గది అద్దెకు తీసుకుని అందులో వరండాలో రేకులషెడ్డు వేసుకుంటూ బల్దియా ఆదాయానికి గండి కొడుతున్నా రు. విలువైన స్థలాల్లో ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. టౌన్ విభాగం అధికారులు నిత్యం పర్యవేక్షించాలని, ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆదాయానికి గండి... ఆస్తుల గుర్తింపేది
విలువైన స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం లభిస్తుంది. మున్సిపల్ ఆస్తులు గుర్తించాలని ఇటీవల ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. బల్దియాలకు స్థిరాస్తులు సర్వసాధారణం. అలాంటి ఆస్తులను గుర్తించి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఎల్‌ఐఎస్), డబుల్‌ఎంట్రీ అక్రూవల్ బెస్ట్ అకౌంటెంటింగ్ సిస్టమ్ (డీఈఏడీఏఎస్)లో తప్పనిసరిగా నమోదు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా కేంద్రంలోని శ్రీరామ థియేటర్ చౌరస్తాలో బల్దియాకు క్వార్టర్‌ల్స్, బిల్డింగ్స్, రైతుబజార్ ఉన్నాయి. కొత్తబస్టాండ్‌లో ఖాళీ స్థలాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వీటిని గుర్తించాలన్నప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోనట్లు తెలిసింది.
రోడ్లపై ఆక్రమణలు
మున్సిపల్ ఆస్తులు అన్యాక్రాంతం కావడంతోపాటు, జిల్లా కేంద్రంలో రోడ్లపై షెడ్లు వేసుకుని అక్రమంగా కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధానమైన యావర్‌రోడ్, తహసీల్ చౌరస్తా, కొత్తబస్టాండ్, టవర్‌సర్కిల్, పాతబస్టాండ్, గొల్లపల్లిరోడ్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైనే పండ్ల విక్రయాలు చేపడుతున్నారు. గాజులు అమ్మేవారు, ఫుట్‌పాత్‌తోపాటు రోడ్లపైకి వచ్చి విక్రయిస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి మున్సిపల్ స్థలాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, కాంప్లెక్స్‌లు నిర్మిస్తే బల్దియాకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
విచారణ చేస్తున్నాం
జగిత్యాల మున్సిపాలిటీలోని 3ఎంఐజీ, 1 ఎల్‌ఐజీ క్వార్టర్లపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నాం. రెవెన్యూ విభాగం వారిని ఆదేశించాం. పూర్తిస్థాయిలో విచారించిన అనంతరం చర్యలు తీసుకుంటాం. గతంలోనే అలాట్ చేసినట్లు తెలిసింది.
– సత్యప్రణవ్, మున్సిపల్ కమిషనర్


