● పట్టించిన సీసీకెమెరాలు ● తులంన్నర బంగారం.. ● ద్విచక్ర వాహనం స్వాధీనం
రాయికల్: పట్టణంలోని ఇటిక్యాల క్రాస్ రోడ్ వద్దనున్న కల్లెడ నర్సు అనే వృద్ధురాలి మెడలోంచి బంగారం చోరీ చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి.. వారి నుంచి ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నామని జగిత్యాల డీఎస్పీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. రాయికల్ ఠాణాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటిక్యాల క్రాసింగ్ వద్ద ఒంటరిగా నివసిస్తున్న నర్సు ఇంట్లోకి ఈనెల 5న గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి తులంన్నర బంగారం దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై సుధీర్‌రావు, స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు పట్టణంలోని సీసీకెమెరాల పుటేజీలను పరిశీలించారు. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై పల్లికొండ నరేశ్, తోపారపు నవనీత్, కల్లెడ మనోజ్ తిరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితులు కుమ్మరిపల్లి బస్టాండ్ నుంచి రాయికల్‌కు వెళ్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి తులంన్నర బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రాయికల్ ఎస్సై సుధీర్‌రావు, క్రైంపార్టీ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, విజయ్, తిరుమల్‌ను డీఎస్పీ అభినందించారు.


