సిరుల పంట.. ప్రకృతి బాట | - | Sakshi
Sakshi News home page

సిరుల పంట.. ప్రకృతి బాట

Sep 10 2026 12:09 AM | Updated on Sep 10 2026 12:09 AM

● రసాయన రహిత సాగుతో భూసార పరిరక్షణ ● తగ్గనున్న పెట్టుబడి.. పెరగనున్న నాణ్యమైన దిగుబడి ● జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌తో రైతులకు మేలు

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న డీఏవో భాస్కర్‌, నోడల్‌ అధికారి

వర్మికంపోస్ట్‌ తయారీ విధానం

గొల్లపల్లి: రసాయనాల్లేని సాగుతో నేలకు బలం.. ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ స్పష్టం చేస్తోంది. రైతులు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించేందుకు స్థానిక వనరుల ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎంతగానో దోహదపడతాయి. విచక్షణారహితంగా వాడుతున్న రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలతో భూమి నిర్జీవంగా మారుతున్న తరుణంలో శ్రీప్రకృతి వ్యవసాయంశ్రీ అన్నదాతకు కొత్త ఆశాకిరణంగా నిలుస్తోంది. ఘన జీవామృతం, పంచగవ్య, వేప గింజలు, సీతాఫల ఆకుల కషాయాల వంటి సహజ పదార్థాలతో నాణ్యమైన ఉత్పత్తులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌’ ద్వారా స్థానికంగా లభించే పశువుల వ్యర్థాలు, జీవ పదార్థాలు, వ్యవసాయ అవశేషాలతో భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి.

క్షేత్రస్థాయిలో శిక్షణలు.. మట్టి నమూనాల సేకరణ

● రైతులు తమ ప్రాంత వాతావరణం, నేల స్వభావానికి సరిపడే పంటలను ఎంచుకునేలా వ్యవసాయ అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు.

● ప్రతి క్లస్టర్‌లో దాదాపు 125 మంది రైతులతో బృందాన్ని ఏర్పాటు చేసి, శాసీ్త్రయ పద్ధతిలో మట్టి నమూనాలను సేకరిస్తున్నారు.

● జిల్లా వ్యాప్తంగా 23 క్లస్టర్లులో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.

● ల్యాబ్‌ పరీక్షల ద్వారా నేలలోని పోషక లోపాలను గుర్తించి, వాటికి తగినట్లు సహజ ఎరువుల వాడకంపై సాంకేతిక సలహాలు అందిస్తున్నారు.

● ఘన జీవామృతం (నేలలో సూక్ష్మజీవుల వృద్ధికి), పంచగవ్య (పైరు ఎదుగుదలకు), వేప, సీతాఫల కషాయాలు (చీడపీడల నివారణకు) పొలాల్లోనే స్వయంగా తయారు చేసుకునేలా శిక్షణ ఇస్తున్నారు.

సీఆర్‌పీలదే కీలక పాత్ర

మహిళా సంఘాల పరిధిలోని క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లకు (సీఆర్‌పీ) ప్రత్యేక తర్ఫీదునిచ్చి రంగంలోకి దించారు. రైతులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ మట్టి సేకరణ, సహజ ఎరువుల తయారీ, అవగాహన సదస్సుల నిర్వహణలో వీరు వారధిగా వ్యవహరిస్తున్నారు.

పెట్టుబడి తగ్గింది.. లాభం పెరిగింది

నేను 12 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న. పదెకరాల్లో మామిడి, రెండెకరాల్లో వరి నాటేసిన. అంతర పంటగా కూరగాయలు పండిస్తున్న. ప్రకృతి సేద్యం కోసం ప్రత్యేకంగా నాలుగు గిరిజాతి ఆవులను కొనుగోలు చేసి జీవామృతం తయారుచేసి వాడుతున్న. రసాయనాల పెట్టుబడి భారం తగ్గింది. చెట్టుచుట్టూ బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. 15ఏళ్లుగా తోట దున్నలేదు. అదనంగా ఎరువు అవసరం లేదు. మామిడి తోటలకు మట్టి ద్రావణం స్ప్రే చేయడం ద్వారా పురుగు ఆకును తినకుండా ఉంటుంది. ఇంగువా, పుల్లటి మజ్జగా స్ప్రేచేయడం ద్వారా చెడు బ్యాక్టీరియా ఉండదు. తేనెటీగల ఉధృతి పెరిగి లాభం చేకూరుస్తాయి. అలాగే నీము అస్త్రం స్ప్రే చేయడం ద్వారా పంట ఎదుగుతుంది.

– మిట్టపల్లి రాములు, రైతు, తుంగూర్‌

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, క్షేత్ర ప్రదర్శనలను రైతులు అందిపుచ్చుకోవాలి. దశలవారీగా రసాయనాలను తగ్గించి, సహజ పద్ధతులను అలవర్చుకోవడం వల్ల భూసారం పెరగడంతో పాటు సమాజానికి విషరహిత ఆహారం అందుతుంది. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలతో ముందుకెళ్లాలి.

– భాస్కర్‌, డీఏవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement