రామగుండం గ్రిడ్‌ ఫెయిల్యూర్‌.. చీకట్లో దక్షిణ భారతం | - | Sakshi
Sakshi News home page

రామగుండం గ్రిడ్‌ ఫెయిల్యూర్‌.. చీకట్లో దక్షిణ భారతం

Sep 11 2026 9:46 AM | Updated on Sep 11 2026 9:46 AM

రామగుండం గ్రిడ్‌ ఫెయిల్యూర్‌.. చీకట్లో దక్షిణ భారతం ● జనరేటర్ల సాయంతో ఆపరేషన్లు చేశాం

కొండగట్టు బస్సు ప్రమాదం

ఎన్టీపీసీ పవర్‌ప్లాంట్‌

కొండగట్టు ప్రమాద దృశ్యం (ఫైల్‌)

2001, సెప్టెంబరు 11న అమెరికాలో ని ట్విన్‌ టవర్స్‌పై ఉగ్రదాడులు జరిగాయి. సరిగ్గా అదే రోజు ప్రస్తుత పెద్దపల్ల్లి జిల్లా ఎన్టీపీసీ రామగుండంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సదరన్‌ గ్రిడ్‌ ఫెయిల్యూర్‌ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిమ్మచీకట్లోకి జారిపోయింది. దీని ప్రభావం తమిళనాడు, కర్ణాటక, కేరళపైనా పడింది. ఫలితంగా రాష్ట్రమంతా కరెంటు లేదు. రైల్వే, కమ్యూనికేషన్స్‌, ఆపరేషన్లు కష్టంగా మారాయి. సాధారణ శస్త్రచికిత్సలు వాయిదాపడ్డాయి. అత్యవసరమైనచోట జనరేటర్లతో సర్దుకున్నారు. పత్రిక కార్యాలయాలు, టీవీ మీడియా ఆఫీసులు కరెంటు కష్టాలు చవిచూశాయి. బహుళ అంతస్తులు, అపార్ట్‌మెంట్‌ ప్రజలు లిఫ్టులు పనిచేయక ఇబ్బందులు పడ్డారు. మరునాడు రాత్రికి గ్రిడ్‌ పునరుద్ధరించారు. అప్పటి వరకూ అమెరికాపై దాడులు జరిగిన సంగతి దక్షిణ భారతవాసులకు తెలియకపోవడం గమనార్హం. ప్రపంచానికి నిరంతరం వెలుగులు పంచే రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌లో దాదాపు రెండు రోజులపాటు విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోవడం అదే తొలిసారి, చివరిసారి. సెప్టెంబరు 11న అమెరికాలో ఉగ్రదాడులు.. మనవద్ద కరెంటు పోవడంతో ప్రజల ఆందోళనతో అనేక పుకార్లు షికార్లు చేశాయి.

25 ఏళ్ల క్రితం జరిగిన ఘటన మాకు ఇప్పటికీ షాకింగే. కరెంటు ఎందుకుపోయిందో తెలియదు. ఎప్పుడు వస్తుందంటే అధికారులు చెప్పలేమన్నారు. ఏదో పెద్ద సమస్య అని అర్థమైంది. షెడ్యూల్‌ ప్రకారం.. ఎమర్జెన్సీ ఆపరేషన్లను అవాయిడ్‌ చేయలేదు. కొన్ని జనరేటర్లు పెట్టి చేసేశాం, మరికొందరు వైద్యులు చీకటి ఉన్నా.. టార్చ్‌లైట్లు పెట్టి ఆపరేషన్లు పూర్తి చేశారు. కొన్నింటిని వాయిదా వేశాం. నా సర్వీసులో గోదావరిఖనిలో రెండు రోజులపాటు కరెంటు పోయిన సందర్భం అదే. అమెరికాపై ఉగ్రదాడి జరిగి వందలాదిమంది మరణించిన రోజు కావడంతో సెప్టెంబరు 11ను అంత తేలిగ్గా మర్చిపోలేం. – డాక్టర్‌ నిరంజన్‌, గోదావరిఖని

2018 సెప్టెంబరు 11.. అప్పటి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ.. తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో రాష్ట్రంలో ఎలక్షన్‌ వేడి మొదలైంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (జగిత్యాల– శనివారంపేట సర్వీసు) కొండగట్టు వద్ద సామర్థ్యానికి మించి దాదాపు 100 మందికిపైగా ప్రయాణికులతో గుట్ట ఘాట్‌ రోడ్డు దిగుతోంది. ఆఖరు మలుపు వద్ద అదుపుతప్పి మట్టి కోసం తీసిన 12 అడుగుల గొయ్యిలో పడింది. చాలామంది ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరాడక, అంతర్గత గాయాలు, రక్తస్రావంతో 60మందికిపైగా మరణించారు. దేశంలోని ఏ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలోనూ ఇంతటి ప్రాణనష్టం జరగలేదు. హిమాచల్‌ప్రదేశ్‌, డార్జిలింగ్‌ వంటి ఎత్తయిన పర్వతాలు, లోయలున్న ప్రాంతాల్లో బస్సు పడిన ఘటనల్లోనూ ఈ స్థాయిలో ప్రాణనష్టం సంభవించకపోవడం గమనార్హం. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం అందినా.. వారి కుటుంబాలు రోడ్డు ప్రమాదం రూపంలో తగిలిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement