నాలుగు ఆటోలు.. రెండు ట్రాక్టర్లు డీజిల్‌కు రూ.1.80లక్షలు | - | Sakshi
Sakshi News home page

నాలుగు ఆటోలు.. రెండు ట్రాక్టర్లు డీజిల్‌కు రూ.1.80లక్షలు

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

రాయికల్‌ పట్టణ వ్యూ

రాయికల్‌: రాయికల్‌ చిన్న మున్సిపాలిటీ. మేజర్‌ పంచాయతీగా ఉన్న రాయికల్‌ను 12 వార్డులతో మున్సిపాలిటీగా చేశారు. ఆదాయం తక్కువగా ఉన్న ఈ బల్దియాలో చెత్త సేకరణ కోసం ఆటోలు, ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. వీటికి వినియోగించే డీజిల్‌ ఖర్చు ఏకంగా నెలకు అక్షరాల రూ.1.80లక్షల నుంచి రూ.రెండు లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ ఖర్చులపై పట్టణంలో సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. బల్దియాలోని 12 వార్డుల్లో చెత్త సేకరణకు ప్రతిరోజు నాలుగు మినీ ఆటోలు, ఒక ట్రాక్టర్‌ మాత్రమే వినియోగిస్తుండగా.. నెలకు అంత పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చు ఏంటని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

వారంలో ఒకట్రెండు రోజులు మాత్రమే..

మున్సిపాలిటీలో 12 వార్డులు, 4500 గృహాలు ఉన్నాయి. చెత్త సేకరణకు మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఆరు మినీఆటోలను గతంలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం నాలుగు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. రెండు ట్రాక్టర్లను కొనుగోలు చేయగా.. ఒకటి చెత్త సేకరణకు, మరొకదానిని ఫ్రంట్‌బ్లేడ్‌గా వినియోగిస్తున్నారు. 12వార్డుల్లో వారానికి ఒకటి లేదా రెండుసార్లు చెత్త సేకరిస్తున్నారు.

అంచనాలు మించి ఖర్చు

నాలుగు ఆటోలు, ఒక ట్రాక్టర్‌ ద్వారానే చెత్తను సేకరిస్తుండగా.. నెలకు పెట్రోల్‌, డీజిల్‌ కోసం రూ.1.80 నుంచి రూ.రెండు లక్షలు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆటోలు డీజిల్‌తో నడుస్తుండగా.. ఇక్కడ మాత్రం పెట్రోల్‌ ఆటోలు వినియోగిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ కోసం రూ.లక్షల్లో వ్యయం చేస్తుండడంతో సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. గతంలో చెత్త సేకరణకు 57 మంది పారిశుధ్య సిబ్బంది ఉంటే ప్రస్తుతం 26 మందే ఉన్నారు. మహిళా సిబ్బంది ఊడ్వడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లేందుకు పరిమితం అవుతున్నారు. పురుషులు ట్రాక్టర్‌ ద్వారా చెత్త సేకరిస్తున్నారు. ఆటోలు అందుబాటులోకి తెచ్చి ఇంధన ఖర్చు పారదర్శకంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

రాయికల్‌ మున్సిపాలిటీ స్వరూపం

వార్డులు 12

గృహలు 4500

పారిశుధ్య కార్మికులు 26

ఆటోలు 6

వినియోగంలో ఉన్నవి 4

ట్రాక్టర్లు రెండు

వెలువడే చెత్త 9 టన్నులు

డ్రైవర్‌, కార్మికుడు ఒక్కడే

ఈ ఫొటోలో కనిపిస్తున్నది రాయికల్‌ బల్దియాలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు. ఉదయం మినీ ఆటో డ్రైవర్‌గా పనిచేయడంతోపాటు అదే ఆటోలో చెత్తసేకరణ చేపడుతున్నాడు. వార్డుల్లోని ఇళ్లముందు వాహనం ఆపుతూ.. చెత్త సేకరిస్తూ మళ్లీ అతడే డ్రైవింగ్‌ చేస్తూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా చేయడం ద్వారా ఆటోకు డీజిల్‌ వినియోగం పెరుగుతోంది. మరోవైపు రాయికల్‌ మున్సిపాలిటీలో సిబ్బంది కొరత వేధిస్తోందని చెప్పకనే చెబుతోంది.

మినీ ఆటోలను ఎక్కువసార్లు తిప్పుతున్నాం

బల్దియాలో 12 వార్డుల్లో చెత్త సేకరణ కోసం ఉన్న ఆటోలనే ఎక్కువ సార్లు తిప్పడంతో పెట్రోల్‌, డీజిల్‌ వ్యయం అవుతోంది. రిపేరులో ఉన్న ఆటోలను వినియోగంలోకి తీసుకువస్తాం.

– మనోహర్‌గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement