మొక్కజొన్నపై వానరమూకలు | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్నపై వానరమూకలు

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

● కుటుంబసభ్యులంతా తోటల వద్ద కాపలా ● తరిమికొట్టేందుకు కుక్కలు, చెట్లకు మైక్‌లు ● అయినా నష్టం కలిగిస్తున్న కోతులు

జగిత్యాలఅగ్రికల్చర్‌: రైతన్నలు రాత్రింబవళ్లు కష్టపడి పంట పండించడం ఒక ఎత్తైతే.. ఆ పంటను కోతుల నుంచి కాపాడడం మరో ఎత్తుగా మారింది. ప్రస్తుతం మొక్కజొన్న పంట గింజ దశకు చేరుకుంది. ఈ సమయంలో రైతులు తోటల వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కోతుల సమూహం (సుమారు రెండుమూడు వందలు)గా వస్తున్న కోతులు పంటను గంట వ్యవధిలోనే సర్వనాశనం చేస్తున్నాయి. కోతులను తోటల నుంచి తరిమేందుకు రైతులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ నేపథ్యంలో రైతులు కొంతమంది సోలార్‌ కంచెలు ఏర్పాటు చేస్తుండగా.. పెద్దపెద్ద శబ్దం చేసే మైక్‌లు పెడుతున్నారు.

మొక్కజొన్న వేయాలంటేనే భయం..

తొలకరి వర్షాలు కురవగానే రైతులు పెసర, మొక్కజొన్న, వేరుశెనగ వంటి పంటలు వేస్తారు. కొంతకాలంగా కోతుల బెడద ఎక్కువవడంతో రైతులు వేరుశెనగ, పెసర సాగు తగ్గించారు. మొక్కజొన్న పంటను మాత్రం దాదాపు 50 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గింజ దశకు చేరుకున్న పంటను ఓ వైపు రామచిలుకలు, మరోవైపు అడవిపందులు, ఇంకోవైపు కోతులు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో ఎక్కువగా గుట్టల ప్రాంతం కావడంతో మొక్కజొన్న పంటను వేయాలంటేనే ఇక్కడి రైతులు భయపడే పరిస్థితి ఉంది.

తినేది తక్కువ..ధ్వంసం చేసేది ఎక్కువ

కోతులు గుంపులుగుంపులుగా వచ్చి మొక్కజొన్న కంకులను నాశనం చేస్తున్నాయి. కంకిలో గింజలు లేకపోతే అన్ని కంకులను చీరి పారేస్తున్నాయి. అంతరపంటగా పసుపు వేసిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మొక్కజొన్న గింజకు వచ్చిన తర్వాత రైతులు ఉదయం, సాయంత్రం కాపలాగా వెళ్లాల్సిన పరిస్థితి. చేతిలో కర్ర లేకపోతే వారిపైనే దాడి చేస్తున్నాయి.

కోతులను ఎదుర్కొనేందుకు తంటాలు

తోటల నుంచి కోతులను తరిమేందుకు రైతులు రూ.50వేల వరకు ఖర్చు పెట్టి సోలార్‌ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని కోతులు ఈ సోలార్‌ కంచెలను కూడా లెక్క చేయడం లేదు. ఈ క్రమంలో కొందరు రైతులు కుక్కలను పెంచుతున్నారు. మరికొందరు సెల్‌ఫోన్లలో కుక్కల అరుపులను రికార్డు చేసి చెట్లకు మైక్‌లు కడుతున్నారు. ఇంకొందరు పంట చుట్టూ వల పెడుతున్నారు. పెద్ద సంఖ్యలో కోతులు వచ్చిన ప్పుడు టపాసులు పేల్చుతున్నారు. పంటలను కోతుల బారి నుంచి కాపాడేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని, ప్రభుత్వం ఆలోచనలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement