కోరుట్లరూరల్: కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో పల్లెలు విధ్వంసం అయ్యాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ మండలంలోని అయిలాపూర్‌లో ఆదివారం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. చెత్త ఊడ్చి ట్రాక్టర్‌లో వేశారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇచ్చారని, దాని ద్వారా ప్రతిరోజూ చెత్త సేకరణ జరిగేదని, ఈ ప్రభుత్వంలో డీజిల్‌కు డబ్బులు లేని పరిస్థితి నెలకొందన్నారు. పల్లెప్రకృతి వనాల ద్వారా మొక్కలు పెంచితే ఈ ప్రభుత్వంలో ఉన్న మొక్కలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
చదరంగంతో మేధాశక్తి
జగిత్యాలజోన్:విద్యార్థుల్లో ఏకాగ్రతకు చదరంగం దోహదం చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో జీనియస్ చెస్ అకాడమీని ప్రారంభించారు. ఆటలతో విద్యార్థుల్లో పోటీతత్వం అలవడుతుందన్నారు. ఎమ్మెల్సీ రమణ, మాజీమంత్రి జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, కోచ్ కంకిటి అనూప్‌కుమార్, నిర్వాహకులు సంగీత, నవీన్, కంకటి కనకయ్య, కో–ఆర్డినేటర్ సుజన్‌కుమార్ పాల్గొన్నారు.
జగిత్యాల పచ్చదనంతో నిండాలి
జిల్లా కేంద్రం పచ్చదనానికి చిరునామాగా చేయాలని ఎమ్మెల్యే అన్నారు. 14వ వార్డులో ఆదివారం వన మహోత్సవం నిర్వహించారు. ఫిల్టర్ బెడ్ వద్ద రూ.5 లక్షలతో గ్రీన్‌షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. 15 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు పనులను పరిశీలించారు. మొక్కలు నాటడంతోపాటు సంరక్షించాలని కోరారు. కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్ స్వప్న, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య, నాయకులు బండ శంకర్, గిరి నాగభూషణం, బాలే శంకర్, కుసరి అనిల్, రాము, శరత్‌రావు పాల్గొన్నారు.
రైతు కుటుంబానికి అండగా..
జగిత్యాలరూరల్: బీర్‌పూర్ మండలం కండ్లపల్లికి చెందిన పర్వతం అంజన్న ఇటీవల విద్యుత్‌షాక్‌తో మృతి చెందగా.. ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.4.50లక్షల బాండ్, రూ.50వేల చెక్కును ఎమ్మెల్యే అందించారు. కాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. సర్పంచ్ సురేందర్, ఉప సర్పంచ్ రవి, ఏఈ శ్రీనివాస్, లైన్‌మెన్ సతీశ్ పాల్గొన్నారు.
ఎస్సారెస్పీకి 2,894 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు 2,894 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1080.20 అడుగులు, 45.459 టీఎంసీలుగా ఉంది. 933 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.
మెట్‌పల్లి లయన్స్ క్లబ్‌కు మెంబర్షిప్ రోలింగ్ ట్రోఫీ
మెట్‌పల్లి: మెట్‌పల్లి లయన్స్ క్లబ్‌కు ఇంటర్నేషనల్ మెంబర్షిప్ రోలింగ్ ట్రోఫీ అందించారు. రామగుండంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2025–26 సంవత్సరానికి ఎక్కువ సంఖ్యలో మెంబర్షిప్ చేయించి ముందంజలో నిలిచిన క్లబ్ అధ్యక్షుడు వెల్ముల శ్రీనివాస్‌రావుకు ట్రోఫీ అందించి అభినందించారు. కార్యదర్శి బొమ్మెల శివ, జోగ జగదీశ్వర్ తదితరులున్నారు.


