గ్రామాభివృద్ధికి బాటలు | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధికి బాటలు

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

● వికసిత్‌ ప్రణాళిక రూపకల్పనకు గ్రామసభలు ● గ్రామాల అభివృద్ధి.. కూలీల ఉపాధికి భరోసా

కథలాపూర్‌/పెగడపల్లి: గ్రామ పంచాయతీల సమగ్ర భాగస్వామ్యమే ధ్యేయంగా ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ గ్రామీణ్‌’ (వీబీజీరాంజీ) పథకంలో పనుల గుర్తింపు మొదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘వికసిత్‌ గ్రామపంచాయతీ ప్రణాళికలు’ (వీజీపీపీ) రూపొందించడానికి జిల్లాలో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ పాలకవర్గాలతోపాటు ప్రజలను భాగస్వామ్యం చేసి తమ గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి తీర్మానాలు చేస్తున్నారు. పనులకు అయ్యే ఖర్చును అంచనా వేసి కూలీలకు అనుగుణంగా కల్పించాల్సిన పనిదినాలను లెక్కించనున్నారు. 2026–2027 ఏడాదికి సంబంధించిన ప్రణాళికలో 318 రకాలు పనులను ప్రతిపాదిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులతోపాటు మండల పరిషత్‌ అధికారులు పనుల వివరాలను నమోదు చేస్తున్నారు. గ్రామస్థాయిలో తీసుకున్న ప్రణాళికలను మండలస్థాయిలో ఆమోదించి జిల్లాస్థాయికి పంపాల్సి ఉంటుంది.

385 గ్రామాలు.. 2.80లక్షల మంది కూలీలు

జిల్లాలో 20 మండలాలు.. 385 గ్రామ పంచాయతీలున్నాయి. మొత్తంగా 1.70 లక్షల జాబ్‌కార్డులున్నాయి. ఇందులో 2.80లక్షల మంది కూలీలుగా ఉన్నారు. వీబీజీ రామ్‌జీ పథకం పనులకు వెళ్లే కూలీలు 1.37లక్షలు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు.

అభివృద్ధి పనుల్లో స్వేచ్ఛ పంచాయతీలకే

వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా గ్రామాభివృద్ధికి ఏది అత్యంత అవసరమో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛను పంచాయతీలకు ఇచ్చారు. గ్రామపంచాయతీ పాలకవర్గాలతోపాటు మహిళాసంఘాలు, రైతులు, ప్రజలు గ్రామసభల్లో పాల్గొని పనులపై చర్చించి ప్రతిపాదించే అవకాశం కల్పించారు. నీటి భద్రత, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ భవనాలు, వైకుంఠధామాలు, పాఠశాలల్లో వసతులు, పశువుల పాకలు, విపత్తు నిర్వహణ పనులు ప్రణాళికలో చేర్చుతున్నారు. దీంతో గ్రామాభివృద్ధి జరగడంతోపాటు స్థానిక కూలీలకు ఉపాధి లభించనుంది.

ప్రజలు భాగస్వామ్యం కావాలి

గ్రామాల అభివృద్ధి ప్రణాళిక తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా గ్రామసభల ద్వారా వికసిత్‌ గ్రామపంచాయతీల ప్రణాళికలు రూపొందించాలి. గ్రామాల అభివృద్ధికి స్వయంగా బాటలు వేసుకునేందుకు ఇది మంచి అవకాశం.

– శంకర్‌, ఎంపీడీవో, కథలాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement