ఆరిపోతున్న ‘అమ్మ’కు ప్రాణం పోయరూ.. | - | Sakshi
Sakshi News home page

ఆరిపోతున్న ‘అమ్మ’కు ప్రాణం పోయరూ..

Aug 25 2026 12:51 AM | Updated on Aug 25 2026 12:51 AM

క్యాన్సర్‌తో విలవిలలాడుతున్న నిరుపేద ఆపరేషన్‌ చేయించినా తిరగబెట్టిన మహమ్మారి వైద్య చికిత్సకు రూ.3 లక్షలు అత్యవసరం దాతల సాయం కోసం ఎదురుచూపులు

గొల్లపల్లి: వారిది నిరుపేద కుటుంబం. రేకులషెడ్డులో నివాసం. రెక్కలను నమ్ముకుని జీవిస్తున్న ఆ పేద కుటుంబం ఇంటి వెలుగును క్యాన్సర్‌ అనే మహమ్మారి కబళించేందుకు సిద్ధంగా ఉంది. ఆమెను కాపాడుకోవడం ఎలాగో తెలియక భర్త.. ఆమె నలుగురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గొల్లపల్లి మండలం భీమ్‌రాజ్‌పల్లి గ్రామానికి చెందిన సుద్దాల బాపయ్య, మంజుల దంపతులు. వీరికి సొంత ఇల్లు కూడా లేదు. చిన్న రేకుల షెడ్డులోనే ముగ్గురు కుమారులు, కూతురుతో కాలం వెళ్లదీస్తున్నారు. రోజూ కూలీనాలీ చేసుకుంటూ ఉన్నంతలో ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో క్యాన్సర్‌ రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది.

నాలుగు రోజులకే తిరగబెట్టిన వ్యాధి

మంజుల దవడ భాగంలో గడ్డ ఏర్పడటంతో ఆమె ను కరీంనగర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు క్యాన్సర్‌గా నిర్ధారించడంతో బాపయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. భార్యను దక్కించుకునేందుకు రూ.3లక్షలు అప్పు తెచ్చి ఆపరేషన్‌ చేయించాడు. ఆపరేషన్‌ పూర్తయి ఇంటికి తీసుకెళ్లారు. ఇక కోలుకుంటుందని అనుకుంటుండగా వారి ఆశలు నాలుగు రోజుల్లోనే ఆవిరైపోయాయి. మహమ్మారి మళ్లీ తిరగబెట్టడంతో అత్యవసరంగా రెండోసారి ఆపరేషన్‌ చేయాలని, అందుకు మరో రూ.3 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారు.

పైసా లేక విలవిల..

ఇప్పటికే అప్ప చేసి మొదటిసారి ఆపరేషన్‌ చేయించిన ఆ కుటుంబం వద్ద ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేదు. మందులు కొనడానికి పైసాలేక.. మరోసారి ఆపరేషన్‌ చేయించే దారి కానరాక ఆ కుటుంబం విలవిలలాడుతోంది. కళ్లముందే అమ్మ నరకం అనుభవిస్తుంటే ముగ్గురు కుమారులు, కూతురు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘నీకేం కాదు..’ అని ధైర్యం చెప్పాల్సిన భర్త ఏమీ చేయలేని నిస్సహాయతలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాడు.

కనికరించండి.. కాపాడండి

మానవత్వం ఉన్న హృదయం ఈ క్షణంలో స్పందించాల్సిన అవసరం ఉంది. దాతలు చేసే చిన్న సాయం ఆ నలుగురు పిల్లలకు అమ్మ ప్రేమను మళ్లీ తిరిగి ఇచ్చే ఆస్కారం ఉంది. ఆ పేద కుటుంబానికి అండగా నిలిచి మంజులకు పునర్జన్మ ఇవ్వాలని బంధువులు వేడుకుంటున్నారు. ఆర్థిక సాయం అందించాల్సిన వారు 91331 65261 (సుద్దాల అజయ్‌), 7287858321 (సుద్దాల అమూల్య)

నంబర్లలో సంప్రదించగలరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement