జగిత్యాల: జగిత్యాల బల్దియాలో శానిటేషన్ అస్తవ్యస్తంగా మారింది. మున్సిపల్‌లో 50 వార్డులుండగా, లక్షకు పైగా జనాభా ఉంటారు. ప్రస్తుతం వానాకాలం కావడంతో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముంది. వార్డుల్లోని డ్రెయినేజీల్లో పూడిక తీయకపోవడం, మురికినీటి గుంతల్లో ఆయిల్‌బాల్స్ వేయడం లేదు. పారిశుధ్య నిర్వహణకు కావాల్సిన బ్లీచింగ్, కెమికల్స్, కార్మికులకు కావాల్సిన పరికరాలు ఇప్పటికీ ఇవ్వలేదు. గతేడాది నుంచి ఈవిధంగానే కొనసాగుతోంది. శానిటేషన్ ఉపయోగించే చీపుర్లు, బ్లీచింగ్, కెమికల్స్‌కు అధికారులు ఇప్పటివరకు టెండర్లు పిలువలేదు. కొద్దిరోజుల క్రితం టెండర్లు పిలిచినా ఆకస్మికంగా రద్దు చేశారు. అనుకూలమైన వారికి రాలేదనే రద్దు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సాంకేతిక కారణాల వల్ల రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు
కనిపించని ఫాగింగ్
పట్టణంలోని పలు వార్డుల్లో ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగి దోమలు, ఈగలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. అయినా ఒక్క వార్డులో కూడా ఫాగింగ్ నిర్వహించడం లేదు. బ్లీచింగ్ పౌడర్, కెమికల్స్ లేని కారణంగానే నిర్వహించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీస్థలాల్లో పిచ్చిమొక్కలు తొలగించేలా యజమానులకు టౌన్ విభాగం అధికారులు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దోమలు వృద్ధిచెంది ప్రజలు రోగాల బారినపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం అవుట్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది.
టెండర్లు ఖరారు
గతంలో పరికరాలకు సంబంధించి టెండర్లు వేయగా నాణ్యత లేని వస్తువులు తెప్పించారు. బ్రాండెడ్ పేరిట కొటేషన్ తీసుకుని నాణ్యత లేనివి తెప్పించడంతో కౌన్సిల్‌లో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా వాటిని రద్దు చేశారు. ప్రస్తుతం బ్లీచింగ్, కెమికల్స్, పారిశుధ్య పరికరాలకు రూ.30 లక్షల నిధులు కేటాయించారు. వీటికి టెండర్లు వేసినట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
టెండర్లు పూర్తయ్యాయి
శానిటేషన్ విభాగానికి చెందిన బ్లీచింగ్ పౌడర్, చీపుర్లు, కెమికల్స్‌కు సంబంధించి టెండర్లు పిలవడం జరిగింది. రెండురోజుల్లో కార్మికులకు పరికరాలు, బ్లీచింగ్, ఇతర వస్తువులు అందిస్తాం. కమిషనర్ శిక్షణలో ఉండటంతో జాప్యం జరిగింది.
– అరుణ్, డీఈ, జగిత్యాల


