బల్దియాలో చిరు దీపాన్ని తలపిస్తున్న ఎల్‌ఈడీలు పర్యవేక్షణకే నెలకు రూ.1.10 లక్షలు పేరుకుపోయిన బకాయి రూ.30 లక్షలు పనిచేయని సీసీఎంఎస్ బాక్స్‌లు పట్టించుకోని పాలకవర్గం చీకట్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు
రాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లు ఆశించిన స్థాయిలో వెలగకపోవడంతో రాత్రిపూట పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 2019లో ఈఈఎస్‌ఈ సంస్థ ద్వారా మున్సిపాలిటీలో వీధిదీపాల నిర్వహణకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్.. కనీసం ఎల్‌ఈడీ లైట్ల నిర్వహణపై కన్నెత్తి చూడకపోవడంతో చిన్న దీపంలా వెలుగుతున్నాయి. సరైన వెలుతురు లేక ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో 12 వార్డులు, 20,500 జ నాభా, 4,780 గృహాలున్నాయి. వీధిదీపాల నిర్వహణకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు చెందిన ఈఈఎస్‌ఈ సంస్థకు 2019 నుంచి ఏడేళ్లపాటు కాంట్రాక్ట్‌ను అప్పగించింది. ఈ సంస్థ బల్దియాలోని వీధిదీపాల నిర్వహణ, నూతన ఎల్‌ఈడీల ఏర్పాటు, మరమ్మతు వంటివి చేయాల్సి ఉంది.
పర్యవేక్షణకు నెలకు రూ.1.10లక్షలు
వాస్తవానికి రాయికల్ చిన్న మున్సిపాలిటీ. అందులో కేవలం వీధిదీపాల పర్యవేక్షణ కోసం ఈఈఎస్‌ఈ సంస్థతో నెలకు రూ.1.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. బల్దియాలో 1,713 ఎల్‌ఈడీలు ఉన్నాయి. ఇందులో 190 వాట్స్ 31, అలాగే 110 వాట్స్ 35, మరో 35 వాట్స్ 200, అలాగే 18 వాట్స్ 1,447 బల్బ్‌లు అమర్చారు. వీటితోపాటు మరో 120 ఎల్‌ఈడీ లైట్లు అవసరమని మున్సిపల్ అధికారులు గుర్తించారు. అయితే వీధి దీపాలను పర్యవేక్షించాల్సిన ఈఈఎస్‌ఈ సంస్థ పట్టించుకోకపోవడంతో పరిస్థితి మొదటికొచ్చింది. వీధిదీపాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీసీఎంఎస్ బాక్స్‌లు పనిచేయకపోవడంతో మున్సిపల్ సిబ్బందే వార్డుల్లోకి వెళ్లి స్విచ్ఛ్‌లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో టైమర్ బాక్స్ ఉండటంతో సాయంత్రం కాగానే వెలగడం.. ఉదయం కాగానే బంద్ అయ్యేవి. ప్రస్తుతం పర్యవేక్షణ లోపంతో సీసీఎంఎస్ బాక్స్‌లు పనిచేయకపోవడంతో మున్సిపల్ సిబ్బందిని కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది.
నిర్వహణకే రూ.30లక్షలు
వీధిదీపాల నిర్వహణకు గాను తమకు 2024 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.30,14,319 బల్దియా బకాయి ఉన్నట్లు ఈఈఎస్‌ఈ సంస్థ చెబుతోంది. అసలే బల్దియాలో ఖజానా లేక ఇబ్బంది పడుతుంటే కేవలం వీధిదీపాల కోసమే ఇంత బడ్జెట్ ఎలా కేటాయించాలనేది నూతన పాలకవర్గానికి అర్థం కావడం లేదు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ నిర్వాహకులు ఒక్కసారి కూడా బల్దియాలో పర్యవేక్షించకపోవడంతో ఎల్‌ఈడీ బల్బులు కేవలం దీపం వెలుతురులాగా దర్శనం ఇస్తున్నాయి. ప్రతి వర్షాకాలంలో ఎల్‌ఈడీ బల్బుల వద్దనున్న క్యాప్‌లను మరమ్మతు చేయడంతోపాటు, అవసరం ఉన్న వాటిని నూతనంగా ఏర్పాటు చేస్తే ఎక్కువ వెలుతురు వచ్చే అవకాశం ఉంది. కానీ పర్యవేక్షణ లేకపోవడంతో లైట్లు సరిగా వెలగక చీకటిని తలపిస్తోంది. బల్దియా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి లైట్లు వెలుతురు సరిగా వచ్చేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


