దారి తప్పుతున్న
జగిత్యాల: క్రమశిక్షణ, మంచి బోధన చేయాల్సిన కొందరు ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. వారి వృత్తికే కళంకం తెస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండడంతో ఆడపిల్లలను పాఠశాలకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. చెడుమార్గాన్ని అనుసరిస్తున్న ఉపాధ్యాయులు సస్పెండ్, అరెస్ట్ అవుతున్నా కొందరిలో తీరు మారడం లేదు. పోలీసులు, షీటీంలు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకుంటున్నా.. లైంగిక వేధింపుల కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో షీటీంలు, ఐసీడీఎస్, ఐసీపీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు గుడ్‌టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే 100కుగానీ, 181కుగానీ ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటేనే
విద్యార్థినులపై లైంగిక వేధింపుల సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప.. ఆగే పరిస్థితి లేదనడానికి జిల్లాలో జరుగుతున్న సంఘటనలే ఉదాహరణ. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


