అప్రమత్తంగా ఉండాలి
అవగాహనతోనే ప్రమాదాల నివారణ
● గతేడాది వినాయక చవితి పండుగ. అందరూ వినాయక విగ్రహాలను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. మెట్‌పల్లి మండలం రామారావుపల్లి శివారులో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠాపన కోసం తీసుకెళ్తుండగా.. ట్రాక్టర్ అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్‌పై ఉన్న శ్రీకర్‌రెడ్డి గేరు మార్చేందుకు క్లచ్‌కు బదులు యాక్సిలేటర్ తొక్కడంతో ట్రాక్టర్ ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్‌పై ఉన్న ముగ్గురిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. శ్రీకర్ కాలువలో కొట్టుకుపోయి గల్లంతై శవమై తేలాడు.
గొల్లపల్లి: ఆశించిన మేర వర్షాలు లేకపోయినా రైతులు బావులు, బోర్ల కింద వరి సాగుకు సిద్ధమయ్యారు. నాట్ల సీజన్ మొదలవడంతో పొలాల్లో ట్రాక్టర్ల రద్దీ పెరిగింది. నారు పోసిన రైతులు నాటు వేయడానికి పొలాలు దున్నేందుకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ల అజాగ్రత్త, అనుభవం లేక, నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంది. జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తే ప్రమాదాల నుంచి బయట పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
జాగ్రత్తే కుటుంబానికి రక్షణ..
● పొలం దున్నేటప్పుడు ట్రాక్టర్ వేగం పెంచకూడదు.
● ఏటవాలు పొలాల్లో వేగంగా తిప్పడం ద్వారా ట్రాక్టర్ బోల్తా పడే ప్రమాదం ఉంది.
● గట్టు (ఒడ్లు) ఎక్కించే సమయంలో చాలా జాగ్రత్త అవసరం. లేకుంటే ట్రాక్టర్ వెనక్కిపడిపోయే ఆస్కారం ఉంటుంది.
● పొలంలో ట్రాక్టర్ దిగబడితే మరో ట్రాక్టర్ సహాయం తీసుకోవాలి. బయటకు తీయాలన్న ఆత్రుత ప్రదర్శిస్తే బోల్తా పడే అవకాశం ఉంది.
సూచనలు ఇలా..
● డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం ఉన్నవారికే వాహనం అప్పగించాలి.
● పొలం దున్నేటప్పుడు ట్రాక్టర్‌ను 14 నుంచి 16 ఆర్‌పీఎంతో నడిపించాలి.
● మలుపుల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ వేగం పెంచొద్దు.
● వెనుక చక్రాలకు సమాన స్థాయిలో బరువును ట్రాక్టర్ ముందు భాగంలో బిగించాలి
● పొలంలో విద్యుత్ స్తంభాలు ఉండి బ్రేకులు సరిగా పడకపోతే ట్రాక్టర్ బోల్తాపడుతుంది.
● రోటోవేటర్‌తో పొలాన్ని దున్నేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
2023 ఆగస్టులో వెల్గటూర్ మండలం అంబారిపేటలో పొలం దున్నుతున్న సమయంలో కేజ్‌వీల్స్ కిందపడి పోశయ్య అనే రైతు మృతి చెందాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మల్లాపూర్ మండలం మొగిలిపేట సమీపంలో పసుపు తోటలో పనులు పూర్తి చేసుకుని కూలీలతో ఇంటికి తిరిగొస్తుండగా.. కట్టపై నుంచి ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ ప్రమాదంలో నలుగురు కూలీలు లలిత, సాయమ్మ, గంగు, వైష్ణవి మృతి చెందారు.
2025 మేనెలలో మల్లాపూర్ మండలంలో పెద్దులు అనే డ్రైవర్ ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బావిలో పడటంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
పొలంలో ఒకవేళ ట్రాక్టర్ దిగబడినప్పుడు ఇతర ట్రాక్టర్ సాయంతో బయటకు లాగాలి. లేకుంటే పల్టీ కొట్టే అవకాశం ఉంటుంది. పొలం దున్నిన అనంతరం బయటకు వచ్చే సమయంలో బురదను మొత్తం పొలంలోనే పడిపోయేలా చూడాలి. లేకుంటే రోడ్డుపై మట్టి రాలిపోయి వర్షాలు కురిసిన సమయంలో వాహనదారులు పడిపోయే ప్రమాదం ఉంది.
– జక్కుల తిరుపతి , ట్రాక్టర్ డ్రైవర్, దట్నూర్
వ్యవసాయ పనుల్లో వేగం కంటే ప్రాణభద్రత ముఖ్యం. మైనర్లతో పొలం దున్నేందుకు అనుమతి ఇవ్వొద్దు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. గట్లు ఎక్కేటప్పుడు, విద్యుత్ స్తంభాలు, పాడుబడిన బావుల సమీపంలో దున్నేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వ్యవసాయ పనులు పూర్తి చేసుకోవాలి.
– ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి, గొల్లపల్లి


