ఈనెల 31 వరకు గడువు
జగిత్యాలరూరల్: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చాలంటే రైస్‌మిల్లుల పాత్ర కీలకం. రైతు, ప్రభుత్వం, ప్రజా పంపిణీ వ్యవస్థ మధ్య వారధిగా నిలిచే రైస్‌మిల్లు రంగం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ దాడులు.. బియ్యం అప్పగింతలో తీవ్రమైన జాప్యం కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ప్రభుత్వం చర్యలు చేపట్టేనా
రాష్ట్ర ఆహార భద్రతను కాపాడాలంటే ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని సమయం ప్రకారం బియ్యాన్ని మిల్లర్లు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ప్రభుత్వం సేకరణ జాప్యం చేస్తే మిల్లర్ల వద్దనున్న ధాన్యం చెడిపోతుంది. ఈ భయం కూడా మిల్లర్లను ఆందోళన కలిగిస్తోంది. ధాన్యం సేకరణ, మిల్లింగ్, బియ్యం స్వీకరణ ప్రక్రియల్లో నెలకొంటున్న జాప్యాలు, నిల్వ సమస్యలు, పెరుగుతున్న విద్యుత్, రవాణా, నిర్వహణ వ్యయాలు ఈ రంగాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఽ
ధాన్యం నాణ్యతతో మిల్లర్లకు ఇబ్బందులు
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తుండటంతో మిల్లర్లు ప్రభుత్వానికి 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ధాన్యంలో నాణ్యత లేకపోవడంతో క్వింటాల్ ధాన్యానికి 58 నుంచి 60 కిలోల వరకే బియ్యం వస్తున్నాయి. దీంతో మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ పరిస్థితులు, అధిక తేమ, బ్రోకెన్ రైస్ శాతం వంటి కారణాలతో దిగుబడి మారుతుంటుంది. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఒకే ప్రమాణాన్ని అమలు చేయడం వల్ల నిజాయితీగా పనిచేసే వారు కూడా నష్టాలను భరించాల్సి వస్తోందని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి ప్రజాధనాన్ని పరిరక్షించే బాధ్యత ఎంత ముఖ్యమో.. వ్యవస్థలో నిజాయితీగా పనిచేసే పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత కూడా అంతే ముఖ్యమటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరమేనని కూడా చెబుతున్నారు.
సీఎంఆర్ బియ్యం అప్పగింతకు ఆదేశాలు జారీ
జిల్లా వ్యాప్తంగా 2024–25 యాసంగిలో ధాన్యం తీసుకున్న మిల్లర్లు ఈనెల 31 వరకు సీఎంఆర్ అప్పగింతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లాలో గోదాంలు ఖాళీ లేకపోవడంతో బియ్యం అప్పగింతకు సిద్ధంగా ఉన్న మిల్లర్లు ఆందోళనకు గురవుతున్నారు. గడువు కూడా తక్కువ ఉండటం.. గోదాంలు లేకపోవడంతో బియ్యం అప్పగింత సాధ్యమవుతుందో లేదోననే ఆందోళనలో మిల్లర్లు ఉన్నారు.
రైల్వే వ్యాగన్లు వస్తేనే తరలింపు సాధ్యం...
జిల్లాలో సీఎంఆర్ బియ్యం సేకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బియ్యం అప్పగింతకు సిద్ధంగా ఉన్నారు. కానీ గోదాంలు ఖాళీ లేకపోవడంతో ప్రభుత్వం రైల్వే వ్యాగన్లను ఏర్పాటు చేస్తేనే బియ్యం పూర్తిస్తాయిలో అప్పగింతకు సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
2024–25 యాసంగిలో ధాన్యం తీసుకున్న మిల్లర్లు ఈనెల 31 వరకు సీంఎఆర్ అప్పగించాలని ఆదేశాలు వచ్చాయి. మిల్లర్లు తప్పకుండా బియ్యం అప్పగించాల్సి ఉంది. జిల్లాలో గోదాంలు ఖాళీ లేకపోవడంతో రైల్వే వ్యాగన్లకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
– జితేంద్రప్రసాద్, పౌరసరఫరాల శాఖ మేనేజర్


