భూసేకరణ వెంటే పునరావాసం | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ వెంటే పునరావాసం

Aug 9 2026 2:10 AM | Updated on Aug 9 2026 2:10 AM

● సాగునీటి ప్రాజెక్టులకు నిధుల వరద ● మిడ్‌మానేరు ఎడమ కాలువకు మళ్లీ కదలిక ● రోళ్లవాగుకు అటవీ అనుమతులు ● ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల, శ్రీధర్‌ బాబు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అడ్డుగా నిలుస్తున్న భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌ బాబు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ వివిధ అంశాలపై శనివారం హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్షించారు. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ, పర్యావరణ అనుమతులను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా పరిగణించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సుమారు నాలుగున్నరేళ్లుగా నిలిచిపోయిన మిడ్‌మానేరు ఎడమ కాలువ మిగులు పనులను వెంటనే పునఃప్రారంభించాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రతిపాదించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా 10వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు కాకతీయ ప్రధాన కాలువలో డీ–83 నుంచి డీ–94 వరకు ఉన్న 2.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. పత్తిపాక వద్ద 3 టీఎంసీలు లేదా 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి రెండు ప్రత్యామ్నాయాలను అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ నెలాఖరులోగా డీపీఆర్‌ సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు పనులు ఇప్పటికే 96 శాతం పూర్తయ్యాయని అన్నారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 0.250 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 0.949 టీఎంసీలకు పెంచడం ద్వారా స్థానిక పరీవాహక ప్రాంతం నుంచి లభించే నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. చివరి ఆయకట్టులోని దాదాపు 15 వేల ఎకరాలకు సాగునీటి భరోసా లభించనుందని అన్నారు.

ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

నీటి పారుదల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణానికి భూ సేకరణ అడ్డంకిగా మారకుండా చూడాలని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కలెక్టర్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. భూసేకరణ ఆలస్యం అవడం, అటవీ భూముల బదలాయింపు వివిదాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు. నూతన రోడ్ల నిర్మాణం, దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. జిల్లాల్లోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇంజినీర్ల కొరత ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయని, డిప్యుటేషన్‌పై వాటిని సాధ్యమైనంత త్వరలో భర్తీ చేయాలని ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలమయమైన నివాస ప్రాంతాల ప్రజలకు మరొక చోట ఇళ్ల స్థలాలను కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement