డబుల్‌ ట్రబుల్‌..! | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ ట్రబుల్‌..!

Jul 17 2026 3:28 AM | Updated on Jul 17 2026 3:28 AM

ఓటు ఎక్కడుంచుకోవాలి..? గ్రామాల నుంచి పట్టణాలకు వలస రెండుచోట్ల ఓటున్న వారితో బీఎల్వోల పరేషాన్‌ గ్రామాల్లోనే ఓటుకు మొగ్గుచూపుతున్న ప్రజలు పట్టణాల్లో భారీగా తగ్గనున్న ఓటర్లు

జగిత్యాల: స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజిన్‌ (సర్‌) కార్యక్రమం ద్వారా పట్టణాల్లో ఓట్లు చాలా వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉండేందుకు వీలు లేదని ఎన్నికల సంఘం తెలపడంతోపాటు ఒకవేళ ఉంటే జైలుకు వెళ్తారని కూడా ప్రకటించింది. దీంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చినవారు, బడా నాయకులు ఓటు ఎక్కడ ఉంచుకోవాలోనని తర్జనభర్జన పడుతున్నారు. జిల్లాకేంద్రమైన జగిత్యాలకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది ప్రజలు, నాయకులు వచ్చి సెటిల్‌ అయ్యారు. గ్రామాల్లో భూములు, ఆస్తులు ఉండటంతో కొంతమంది అక్కడ కూడా ఓటు హక్కు ఉంచుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే గ్రామాల్లో.. మున్సిపాలిటీ, ఇతరత్రా ఎన్నికలు వస్తే పట్టణాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తాజాగా సర్‌ కార్యక్రమం ద్వారా ఎక్కడో ఒకచోట మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలనే నిబంధన ఉండటంతో చాలామంది స్వగ్రామాల్లోనే ఉంచుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. పట్టణాల్లో కన్నా వారి సొంత ఊరులోనే ఉంచుకుంటే మంచిదని భావిస్తున్నారు.

పట్టణాల్లో భారీగా తగ్గనున్న ఓట్లు

డబుల్‌ ఓట్లు తొలగించడంతో పట్టణాల్లో భారీగా ఓట్లు తగ్గనున్నాయి. మున్సిపాలిటీల్లో వలస వచ్చిన వారు అత్యధికంగా నమోదు చేసుకున్నారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. అన్నిచోట్లా భారీగా ఓట్లు తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,21,032 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపు లక్ష వరకు ఓట్లు తగ్గే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ జరగడం, పూరించిన వాటిని తిరిగి సేకరించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ముందుగా ఈ నెల 25 వరకు గడువు పెంచిన సర్కారు.. కొంత పొడగించింది. ఆ లోపు ప్రతిఒక్కరు మ్యాపింగ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

నాయకుల సమాలోచనలు

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇటు మున్సిపాలిటీలు, అటు సొంతూళ్లలో ఓటు ఉంది. వారు ఓటు హక్కు ఎక్కడ ఉంచుకోవాలని ఆలోచనలో నాయకులు ఉన్నారు. అలాగే చాలామంది అధికారులు కూడా సొంతూరుతో పాటు, వారు ఇంతకుముందు పనిచేసిన చోట ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఏదో ఒక చోట చేసుకోవాల్సి ఉండటంతో వారు సొంత ఊరులోనే నమోదు చేసుకునేలా చూస్తున్నారు.

జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో ఓటర్ల వివరాలు

నాయకుల తర్జనభర్జన

గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్‌, వార్డు మెంబర్‌, మున్సిపాలిటీలో కౌన్సిలర్‌, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో వలసవచ్చిన ఓటర్లది కీలకంగా ఉండేది. చాలామంది రెండు చోట్ల ఉంచుకోవడంతో సర్పంచ్‌ ఎన్నికలు ఒకరోజు, మున్సిపల్‌, ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నికలు వివిధ తేదీల్లో జరగడంతో ప్రతిచోట ఓటు హక్కు వినియోగించుకునే వారు. ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడంతో వారి సొంత గ్రామాల్లోనే ఓటు హక్కు ఉంచండి అంటూ బీఎల్వోలతో పేర్కొంటున్నారు. డబుల్‌ ఓట్ల ప్రక్రియ తొలగింపు తప్పనిసరి కావడంతో నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. ఉన్న ఊరులో ఓటు హక్కు లేకపోతే పూర్తిగా వెళ్లిపోయినట్లు ఉంటుందని భావిస్తూ ఉన్న ఊరులోనే ఓటు హక్కు ఉంచుకునేలా చూస్తున్నారు. కొందరు భార్యకు పట్టణంలో ఉంచి.. భర్త గ్రామాల్లో ఉంచుకునేలా చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement