● వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుకు వెళ్లాల్సిందే.. ● పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి
జగిత్యాలఅగ్రికల్చర్: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, రైతులు అప్రమత్తమై వరికి బదులు తక్కువ నీటితో పండే పంటల సాగుకు మొగ్గు చూపాలని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి సూచిస్తున్నారు. ఎల్‌నినో పరిస్థితులపై ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు.
వర్షపాతంలో మార్పులు
ఎల్‌నినోతో పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అసాధారణంగా పెరుగుతాయి. దీనివల్ల వర్షపాతంలో విపరీతమైన మార్పులు వస్తాయి. రోజు వారి వాతావరణ పరిస్థితులను అస్తవ్యస్తం చేస్తాయి. రుతుపవనాలను బలహీన పర్చి వర్షాలు పడకుండా చేస్తాయి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే జిల్లాలో కనబడుతున్నాయి.
లోటు వర్షపాతం
పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం పరిధిలోని 10 జిల్లాలో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఒక్క కొమ్రుంభీంఆసిఫాబాద్ జిల్లాలో కొంత మెరుగ్గా ఉంది. ఆయా జిల్లాల్లో సాధారణ వర్షపాతం 261.9 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటివరకు కేవలం 183.4 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. జగిత్యాల జిల్లాలో 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఒక్కో మండలంలో 50 నుంచి 60 శాతం లోటు ఏర్పడింది.
ఆగస్టులోనూ వర్షాలు అంతంతే
ఎల్‌నినో ప్రభావంతో ఈనెలతోపాటు ఆగస్టులోనూ వర్షాలు అంతంతమాత్రంగానే కురవనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టులు డెడ్ స్టోరే.ఈకి చేరుకున్నాయి. భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో 19 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. పంటలను కాపాడుకునేందుకు బోర్లు, వ్యవసాయ బావుల్లో నీరు సరిపోవడం లేదు. చాలామంది రైతులు డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు.
ప్రత్యామ్నాయ పంటలే దిక్కు
వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం రైతులకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని కోరుతున్నాం. ఈనెల 16 నుంచి 31 వరకు సజ్జ, కొర్రలు వంటి చిరుధాన్యాలు, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనె గింజల సాగుచేసుకోవచ్చు. కూరగాయల సాగు వైపు వెళ్లవచ్చు. బోదెల పద్ధతి కంది సాగుకు అనుకూలం. ఆయా పంటల్లో మధ్యకాలిక రకాలతోపాటు, మొక్కల మధ్య దూరం తక్కువ ఉండేలా విత్తుకోవాలి. ఆగస్టు 31 వరకు నువ్వులు సాగు చేసుకోవచ్చు.
కీలక దశలో నీరు తప్పనిసరి
ఏ పంటలోనైనా కీలక దశల్లో నీరు అవసరం. ప్రతి పంటకు పూత, జల్లు, పీచు, కంకి దశలో నీరు ఇవ్వాలి. పత్తి వంటి పంటల్లో తేమ కోల్పోకుండా అంతరకృషి చేస్తూ ఉండాలి. మొక్కలు వడలిపోకుండా యూరియా, మల్టీకె వంటి ద్రావణాలను మొక్కలపై పిచికారీ చేయాలి. బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు రసం పీల్చే పురుగులు, పేనుబంక, తెల్లదోమ ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. వీటికి వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి.
పరిశీలనకు బృందాలు
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు, అవసరమైన సూచనలు ఇచ్చేందుకు ప్రతి జిల్లాకు ఒక శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో, వ్యవసాయ పరిశోధన స్థానం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఉంటారు. రైతుల పంట పొలాలను సందర్శించి, అక్కడికక్కడే తగు సలహాలు అందిస్తారు.
పంటల సాగు అంతంతే..
వర్షాలు లేక పంటల సాగు ముందుకు సాగడం లేదు. ఇప్పటికి కేవలం 25 శాతం కంటే తక్కువగానే పంటలు సాగు చేశారు. వరి 12 శాతం, మొక్కజొన్న 78, కందులు 42, సోయాబీన్ 78, పత్తి 89 శాతం సాగు చేశారు. వర్షాలు లేక పంటలన్నీ వడలిపోతున్నాయి. వరినారు మడులకే పరిమితమైంది.


