● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల నియోజకవర్గానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రైతు విజ్ఞాన కేంద్రం మంజూరైనట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. పొలాస పరిశోధనస్థానం డైరెక్టర్‌గా నియమితులైన వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రైతు విజ్ఞాన కేంద్రం కోసం అవసరమైన భూమిని కేటాయించాలని కోరారు. ఈ కేంద్రంతో నియోజకవర్గ పరిధిలోని రైతులకు చాలా ఉపయోగం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఆయన వెంట రైతు విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ విజయ్‌భాస్కర్ ఉన్నారు.
గ్రీన్ టీ బాగుంది
కథలాపూర్: కోరుట్ల నుంచి వేములవాడ వైపు వెళ్తున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్ స్థానిక నాయకుల కోరిక మేరకు కథలాపూర్‌లో కాసేపు ఆగారు. బస్టాండ్ వద్ద ఉన్న ఓ హోటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ కార్యకర్తలతో కలిసి గ్రీన్ టీ తాగారు. గ్రీన్ టీ బాగుందంటూ కితాబు ఇవ్వడంతో కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. ఆయన వెంట మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగేశ్వర్‌రావు, శంకర్, ఎండీ.రఫీ ఉన్నారు.
నీటి సంరక్షణకు కృషి చేయాలి
మల్యాల: ఇంకుడుగుంతలు, కమ్యూనిటీ గుంతలు తవ్వుతూ నీటి సంరక్షణకు కృషి చేయాలని డీఆర్‌డీవో పీడీ రఘువరణ్ అన్నారు. మండలంలోని ఒబులాపూర్‌లో జలసరి కార్యక్రమంలో భాగంగా గురువారం ఇంటింటా మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. అంగడిబోర్ గుట్ట, బొంగులగట్టు గుట్ట వద్ద ప్రదేశాలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ గ్యాదం కుమార్, ఎంపీడీవో స్వాతి, ఉప సర్పంచ్ మల్లేశం, ఏపీవో శ్రీనివాస్, ఈసీ మనోజ్ పాల్గొన్నారు.
ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
జగిత్యాలఅగ్రికల్చర్: విద్యార్థులు చదువుతోపాటు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జె.సురేశ్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొలాస వ్యవసాయ కళాశాలలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి ఆరోగ్యంగా ఉంటేనే ఆలోచనలు బాగుంటాయని తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సౌజన్య ఆధ్వర్యంలో విద్యార్థులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు సుజాత, రత్నాకర్, రాజేంద్రప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
జగిత్యాల:ఆరోగ్యంపై జాగ్రత్తలు తప్పనిసరి అని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. జిల్లాకేంద్రంలో గురువారం ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమన్నారు. శిబిరంలో భాగంగా ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన 110 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ కృష్ణమూర్తి, స్టడీ సర్కిల్ ఇన్‌చార్జి నరేశ్, వేణుగోపాల్ పాల్గొన్నారు.


