కోరుట్ల: వాస్తవానికి పీఎం స్వనిధి లోన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి మహా అయితే రూ.100లోపు ఖర్చవుతుంది. మున్సిపల్ కార్యాలయంలో సమీపంలో ఉన్న ఈ ఆన్‌లైన్ సెంటర్‌లో దరఖాస్తు చేస్తే లోన్ గ్యారంటీ. డబ్బులు వసూలు మాత్రం ఒక్కో దరఖాస్తుకు రూ. వెయ్యి నుంచి రూ.1500 వరకు ఉంటుంది. ఈ దందా వెనక కొంత మంది మున్సిపల్ సిబ్బంది చేతివాటం ఉన్నట్లు సమాచారం. చాలామంది వీధి వ్యాపారులు ఈ సెంటర్ నుంచి ఆన్‌లైన్‌లో రుణసాయం కోసం దరఖాస్తులు చేయడంతో ఈ సమాచారం సరైందని నమ్మక తప్పదు.
ఇదీ పీఎం స్వనిధి (ఆత్మనిర్భర్)
కరోనా లాక్‌డౌన్ సమయంలో వీధి వ్యాపారులు తమ జీవనానికి అవసరమైన సంపాదన పొందలేని దుస్థితిలో పడ్డారు. ఈ పరిస్థితులను గమనించిన కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి (ఆత్మనిర్భర్) పథకం 2020లో తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఎలాంటి గ్యారంటీ లేకుండా మొదటి విడత రూ.15వేలు రుణసాయం వస్తుంది. ఆ డబ్బులు సకాలంలో చెల్లిస్తే మళ్లీ రెండో విడత రూ.25వేలు..ఈ డబ్బులు సరైన రీతిలో చెల్లిస్తే మూడో విడతగా రూ.50వేలు రుణసాయం అందిస్తారు. ఈ రుణ సాయం చెల్లింపు సరిగా జరిగి డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తే రూ.1600 క్యాష్‌బ్యాక్‌తోపాటు 7 శాతం వడ్డీ రాయితీ వర్తిసుంది. ఈ పథకాన్ని ఇటీవల 2030 వరకు పొడిగించారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన, తోపుడు బండ్లు, చిన్న టేలాలు, షాపుల్లో వ్యాపారాలు చేసేవారు అర్హులు. వీరికి మున్సిపాలిటీ జారీ చేసిన వెండింగ్ సర్టిఫికెట్ లేదా వెండింగ్ వ్యాపారుల కమిటీ నుంచి సిఫార్సు ఉండాలి. ఈ క్రమంలో వీధి వ్యాపారుల పేరిట రుణసాయం పొందడం సులభతరంగా ఉండటంతో దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొంత మంది మున్సిపల్ సిబ్బంది పక్కదోవ పట్టినట్లు సమాచారం.
ఆన్‌లైన్ పేరిట అవినీతి దందా..
వీధి వ్యాపారుల రుణసాయం పథకంలో అవినీతి దందాకు తెరలేపేందుకు కొంత మంది మున్సిపల్ సిబ్బంది ఆన్‌లైన్ సెంటర్‌ను వాడుకుంటున్నట్లు సమాచారం. వీధి వ్యాపారుల రుణసాయం కోసం వెళ్లేవారికి కొంత మంది ఆర్‌పీల ద్వారా సదరు ఆన్‌లైన్ సెంటర్‌లో దరఖాస్తు చేయించాలని సూచిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఆన్‌లైన్ కోసం ఎక్కడైనా రూ.100 కంటే ఎక్కువగా డబ్బులు తీసుకోరు. కానీ.. ఇక్కడ ఆన్‌లైన్ పేరిట ఒక్కో వీధి వ్యాపారి నుంచి రుణసాయం కింద వచ్చే డబ్బులను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు వసూలు చేసి రుణసాయం గ్యారంటీ అని చెప్పి.. ఒక వేళ రాకుంటే డబ్బులు వాపస్ చేస్తామని చెబుతున్నట్లు తెలిసింది. ఇలా వసూలు చేసిన డబ్బుల్లో కొంత మంది మున్సిపల్ సిబ్బంది వాటాలు పంచుకుంటున్నట్లు సమాచారం.
అడ్డగోలు దరఖాస్తులు
కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో ఇదివరకు వీధి వ్యాపారుల సంఖ్య కేవలం 1500 నుంచి 2వేల వరకు ఉండేది. వీరిలో సగం మంది పీఎం స్వనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారనుకుంటే కేవలం వెయ్యి వరకు అర్జీలు రావాలి. కానీ.. కోరుట్ల మున్సిపాలిటీలో అడ్డగోలుగా పీఎం స్వనిధి దరఖాస్తులు వస్తుండటం గమనార్హం. క్షేత్రస్థాయిలో వీధి వ్యాపారులు కానివారిని ఎక్కడో ఓ చోట వీధి వ్యాపారం ఉన్నట్లు ఫొటోలు తీయించి వాటిని దరఖాస్తులకు జతచేసి వీధి వ్యాపారుల గుర్తింపు కార్డులు ఇచ్చి మరీ రుణసాయం కోసం దరఖాస్తు చేయిస్తున్నట్లు సమాచారం. వీధి వ్యాపారం ఉన్న లేకున్నా ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు చేస్తే తమ జేబులు నిండుగా ఉంటాయని మున్సిపల్ సిబ్బంది కొంతమంది ఆర్పీలపై ఒత్తిడి తెచ్చి మరీ బోగస్ వీధి వ్యాపారుల పేరిట రుణం కోసం ఆన్‌లైన్ నమోదు చేయిస్తున్నట్లు తెలిసింది. ఆన్‌లైన్ సెంటర్ మాటున వీధి వ్యాపారుల పేరిట సాగుతున్న అవినీతి దందాపై ఉన్నతాధికారులు విచారణ చేస్తే పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘నేను రెండు నెలల
క్రితం పీఎం స్వనిధి లోన్‌కు దరఖాస్తు చేసుకున్న. మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ ఆన్‌లైన్ జిరాక్స్ సెంటర్‌లో రూ.1500 ఇస్తే లోన్ వస్తుందని చెప్పిండ్రు. డబ్బులు ఇచ్చిన. లోన్ వచ్చింది’. ఇది ఓ వీధి వ్యాపారి మాటలివి.


