కరీంనగర్‌అర్బన్: తమ ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్యానికి కట్టుబడి పని చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో టీఎన్జీవో ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఇఫ్తార్ విందు కార్యక్రమం జరగగా మంత్రి హాజరై మాట్లాడారు. తమతోపాటు సమాజం బాగుండాలన్న కోరికతో రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తారని తెలిపారు. ఈద్ వేడుకలకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజాపాలన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు విజయవంతం అయ్యేలా ముస్లింలు ప్రార్థించాలని కోరారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి హైదరాబాదులో ఇఫ్తార్ విందులో పాల్గొంటారని పేర్కొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, కరీంనగర్‌లో ఎలాంటి భేదభావాలు లేకుండా అందరూ కలిసి ఉంటారని, భవిష్యత్తులోనూ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ఈద్గాలు, మసీదుల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్, లక్ష్మీకిరణ్, ట్రైనీ కలెక్టర్ అజయ్‌యాదవ్, ట్రైనీ ఐపీఎస్ వసుంధర, ఆర్డీవో మహేశ్వర్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్