ఇక భూముల లెక్క పక్కా..
భూములు.. ఆస్తులు.. వసతులు జగిత్యాలలో నక్ష సర్వే షురూ.. రాష్ట్రవ్యాప్తంగా 8 బల్దియాలు ఎంపిక అందులో పైలెట్ ప్రాజెక్టుగా జగిత్యాల డ్రోన్లతో చిత్రీకరిస్తున్న అధికారులు
జగిత్యాల: జిల్లా కేంద్రంలో నేషనల్ జియో ఫేషియల్ నాలెడ్జ్ బేస్‌డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హబిటేషన్ (నక్ష) సర్వే ప్రారంభమైంది. గతేడాడే సర్వే ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో ఆగిపోయింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 8 మున్సిపాలిటీలను ఎంపిక చేయగా.. అందులో జగిత్యాల కూడా ఉంది. భారత గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న కార్యక్రమం ఇది. అర్బన్ ఆస్తులకు సంబంధించిన నక్ష సర్వే రూపొందించడం, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. గతేడాది ఫిబ్రవరిలో హెలికాప్టర్ ద్వారా జగిత్యాల మున్సిపాలిటీ ఏరియల్ ఇమేజ్ సర్వే ప్రారంభించారు. ఇప్పటికే ఇమేజ్‌లు సేకరించారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాల వివరాలు, రోడ్లు, ఇంటి నంబర్లు, ఇంటి యజమాన్య రిజిస్ట్రేషన్ పత్రాలు, సమాచారం కోసం సర్వే చేస్తున్నారు. వాస్తవానికి నక్ష గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. ఏదైనా భూములకు సంబంధించి నక్షను ఏర్పాటు చేస్తారు. దాని మాదిరిగానే పట్టణాల్లోనూ భూముల లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాగు భూములకు మాత్రమే ఉండే నక్ష పట్టణాల్లోనూ పటాలకు రూపకల్పన చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సర్వే ఆఫ్ ఇండియా, మున్సిపాలిటీ, భూమి కొలతలు, దస్త్రాల నిర్వహణ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి.
నక్షతో రక్షణ
జిల్లా కేంద్రం కావడం.. చుట్టూ 6 కిలోమీటర్లు విస్తరించడం, ఇటీవల పలు గ్రామాలను ఇందులో విలీనం చేయడం జరిగిపోయింది. దీంతోపాటు అక్రమాలూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. నక్షతో ప్రతి ఒక్కరి ఆస్తులకు సంబంధించిన హద్దులతో కూడిన పత్రం ఇస్తారు. ఎలాంటి అక్రమణగానీ, గొడవలు ఉండవు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికావు. వీటికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో భూముల రక్షణకు నక్ష ఏర్పాటు చేస్తున్నారు.
డ్రోన్లతో చిత్రీకరణ
జగిత్యాల మున్సిపాలిటీలో భవనాలను డ్రోన్లతో చిత్రీకరించారు. వీటి సహాయంగానే జిల్లా కేంద్రంలోని ప్రతి భవనం, ఆస్తులను కొలతలు చేయడంతోపాటు, వాటి సరిహద్దులకు బౌండరీలు ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు. ప్రతి ఒక్క ఆస్తిని అక్షాంశాలు, రేఖాంశాలతో హద్దులు గుర్తించి సంబంధిత ఆస్తులకు గుర్తింపు కార్డులు అందించనున్నారు. వీటితోపాటు, ప్రభుత్వ స్థలాలైన చెరువులు, ఆలయ భూములు పకడ్బందీగా ఉంటాయి. వాటిని ఎవరూ కబ్జా చేసే అవకాశం ఉండదు.
విస్తరిస్తున్న పట్టణం
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో నుంచి పైలెట్ ప్రాజెక్టులుగా కోరుట్ల, జగిత్యాల బల్దియాలను ల్యాండ్ రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో జగిత్యాల ఎంపిక కావడం గమనార్హం. ఈ మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన గ్రామాల్లోని భవనాలను కూడా ఇందులోనే చేర్చుతారు.
48 వార్డులు.. లక్షకు పైగా జనాభా
జగిత్యాల బల్దియా నక్షతో కూడిన పట్టణంగా ఏర్పాటు కానుంది. బల్దియాలో లక్షకు పైగా జనాభా ఉంది. దాదాపు 45 వేల గృహాలుంటాయి. 48వార్డులున్నాయి. వీటన్నింటిని డ్రోన్ల ద్వార చిత్రీకరించి పట్టణ మ్యాప్ రూపొందించి నక్ష ఏర్పాటు చేయనున్నారు.
జగిత్యాల వ్యూ
ఇక భూముల లెక్క పక్కా..


