కరీంనగర్‌అర్బన్: కేడీసీసీబీ సేవలు ప్రశంసనీయమని, మరింత పురోగతి సాధించాలని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ కె.సురేంద్రమోహన్ అన్నారు. ఆదివారం నుస్తులాపూర్ ప్యాక్స్‌తో పాటు కేడీసీసీబీలను సందర్శించారు. 2025 అంతర్జాతీయ సహకార సంవత్సర ప్రాధాన్యతతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వివిధ సహకార రంగ సంస్థలు చేపట్టాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. పెద్దమొత్తంలో రుణాలిచ్చే స్థాయికి ఎదగడం హర్షషీయమని, దేశానికే తలమానికంగా కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిలుస్తోందని కొనియాడారు. ఇక్కడి మంచి విధానాలను రాష్ట్రమంతా పాటించేలా చూడాలన్నారు. రాష్ట్రంలోని కృషి విజ్ఞాన కేంద్రాలు, ఉద్యానవన శాఖలు, మార్కెటింగ్ శాఖ, వివిధ సహకార రంగ సంస్థలను అనుసంధానం చేసి రైతుల ఉత్పత్తులను సమీకరించి, అధిక లాభాలు అందేలా పనిచేయించాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రజానీకానికి నగదు రహిత లావాదేవీల నిర్వహణ, బ్యాంకులు అందించే వివిధ సేవల గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సంఘాల ద్వారా జన ఔషధి కేంద్రాలను ప్రతీ మండల కేంద్రంలో స్థాపించి సభ్యులకు, ప్రజలకు చౌకగా లభించే మందులు విక్రయించాలని వివరించారు. కేడీసీసీ బ్యాంకు ముఖ్యకార్యనిర్వాణాధికారి సత్యనారాయణరావు మాట్లాడుతూ, ఇటీవల నిర్మించిన గోదాముల్లో మిగులు సామర్థ్యాన్ని ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయి, మార్కెటింగ్ శాఖ, రైస్ మిల్లులు ఉపయోగించుకొనుటకు ప్రభుత్వపరంగా అనుమతులు ఇచ్చి సంఘాలకు అద్దెల రూపంగా డబ్బు వచ్చేలా చూడాలన్నారు. అదనపు కమిషనర్ జి.శ్రీనివాస్‌రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార అధికారులు, ఎన్.రామానుజచార్యులు, సి.శ్రీమాల, మనోజ్‌కుమార్, రామకృష్ణ, సహకార అధికారులు, మార్క్‌ఫెడ్ అధికారులు, డీసీఎంఎస్ అధికారులు, బ్యాంకు జనరల్ మేనేజర్లు, సీనియర్ అధికారులు, బ్రాంచ్ మేనేజర్లు, సహకార సిబ్బంది పాల్గొన్నారు.
సహకార శాఖ కమిషనర్ సురేంద్రమోహన్