
ట్రంప్-మామ్దానీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మమ్దానీని అరెస్ట్ చేయాలని, ఆయన్ని దేశం నుంచి వెళ్లగొట్టాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యలపై మమ్దానీ ఘాటుగానే స్పందించారు.
వాషింగ్టన్: న్యూయార్క్ నగర మేయర్ పదవికి భారతీయ మూలాలున్న అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ.. తనను అరెస్ట్ చేసి, దేశం నుండి పంపించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ వ్యాఖ్యలు అమెరికాలో వర్గ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నమేనని అన్నారాయన. 33 ఏళ్ల ఈ డెమొక్రటిక్ సోషలిస్ట్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలే గుప్పించారు.
వర్కింగ్ క్లాస్ పీపుల్‌ను ట్రంప్ మోసం చేశారు. ఆ విషయం నుంచి అమెరికన్ల దృష్టిని మరల్చేందుకు ఆయన తనను లక్ష్యంగా చేసుకున్నారని మమ్దానీ అన్నారు. ‘‘నిన్న ట్రంప్ నన్ను అరెస్ట్ చేయాలని, దేశం నుండి పంపించాలని, పౌరసత్వం తీసేయాలని అన్నారు. నేను ఈ నగరానికి తరాలుగా మొదటి వలసదారుడిగా, మొదటి ముస్లిం, దక్షిణాసియా మూలాలున్న మేయర్‌గా నిలవబోతున్నాను. ఇది నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో అనే దానికంటే, నేను ఏం కోసం పోరాడుతున్నానో దాన్ని దృష్టి మళ్లించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నమే అని మమ్దానీ అన్నారు. రిపబ్లికన్లపై తన పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారాయన.
Donald Trump is attacking me because he is desperate to distract from his war on working people. We must and we will fight back. pic.twitter.com/pKEwnijJaG
— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 2, 2025
న్యూయార్క్ నగర మేయర్ పదవీ రేసులో.. డెమొక్రటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమోపై జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. ఆపై ట్రంప్ సహా రిపబ్లికన్లు మమ్దానీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ పెద్ద కమ్యూనిస్టు పిచ్చోడని.. న్యూయార్క్‌ను నాశనం చేయకుండా తానే కాపాడతానని ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈలోపు..
ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై మమ్దానీ తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లు అమెరికన్ల ఆరోగ్యాన్ని హరించివేస్తుందని, ఆకలితో ఉన్నవారి నుంచి ఆహారాన్ని లాక్కుంటుందని, ధనవంతులకే మళ్లీ లాభాలు చేకూర్చే విధంగా ఉంది అని మమ్దానీ విమర్శించారు.