
న్యూయార్క్: న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న జొహ్రాన్ మమ్దానీ చిక్కుల్లో పడ్డారు. 2015లో మమ్దానీ ‘ఎక్స్’లో అల్ ఖైదా ఉగ్రవాదికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అతడిని వెంటాడుతున్నాయి. అమెరికాలో జన్మించిన అన్వర్ అల్–ఔలాకీ అనే మత బోధకుడు తీవ్రవాదం బాట పట్టడానికి ఎఫ్‌బీఐ నిఘా కారణం కావచ్చు అంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన అప్పటి వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి.
అయితే, వందశాతం కమ్యూనిస్ట్ పిచ్చోడంటూ మమ్దానీని ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన తర్వాతర ఆయన పాత పోస్టులు తాజాగా వెలుగు చూశాయి. న్యూమెక్సికోలో యెమెన్ దేశస్తుల కుటుంబంలో జన్మించిన ఔలాకీ అమెరికాలోని మసీదుల్లో బోధనలు చేసేవాడు. అటు తర్వాత అల్‌ఖైదాలో అగ్ర నాయకుల్లో ఒకడయ్యాడు.
అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్ తదితరాలపై 2001 సెప్టెంబర్ 11న దాడులకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు ఇతడికి సన్నిహితులని తేలడంతో ఎఫ్‌బీఐ నిఘా పెంచింది. అటు తర్వాత అతడు 2004లో యెమెన్‌కు వెళ్లిపోయాడు. అమెరికా ఆస్తులపై దాడులు ఇతడు ఉగ్రవాదులకు పిలుపు ఇచ్చాడనే ఆరోపణలపై 2011లో అధ్యక్షుడు ఒబామా ఆదేశాల మేరకు యెమెన్‌పై జరిపిన డ్రోన్ దాడుల్లో హతమయ్యాడు. ఎలాంటి నేరారోపణలు లేని అమెరికా పౌరుడిని ప్రభుత్వమే చంపడం అసాధారణ విషయమని న్యూయార్క్ పోస్ట్ అప్పట్లో వ్యాఖ్యానించింది.