ఢిల్లీ: ప్రస్తుతం రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. గతేడాది ఆదేశ అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పరస్పరం పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం రానున్నట్లు ఆ దేశ రాయబారి తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌చుక్ అధికారికంగా ప్రకటించారు. గుజరాత్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పోలిష్‌చుక్ ఈ వివరాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాలను మరింత బలోపేతం చేయడానికే జెలెన్‌స్కీ భారత్‌లో పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. పర్యాటకం, మెడిసిన్, ఇండస్ట్రీయల్ వస్తువులు, పోర్టులు తదితర రంగాలలో పరస్పర సహాకారం ఉండనున్నట్లు తెలిపారు.
2024లో మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించినప్పుడు జెలెన్‌స్కీ ఇండియా వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు పోలిష్‌చుక్ తెలిపారు. జెలెన్‌స్కీ పర్యటన ఆ రోజే ఖరారైందన్నారు. ఉక్రెయిన్ కష్టాల్లో ఉన్న సమయంలో ఆ దేశంలో పర్యటించిన అతి కొద్దిమంది ప్రపంచ నాయకులలో మోదీ ఒకరని భారత ప్రధానిని కొనియాడారు. తమ దేశంలో శాంతి నెలకొనాలని గుజరాత్‌లోని ద్వారకా మందిరంలో పూజలు చేసినట్లు పోలిష్‌చుక్ తెలిపారు.
అయితే ఇంతకాలం భారత్‌ను పన్నులతో ఇబ్బందులు పెడదామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో ఇటీవలే ఆ దేశ రాయబారి భారత్‌ను ప్రశంసిస్తూ మాట్లాడారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్‌లో పర్యటిస్తారని తెలిపారు. ఒకరోజైనా గడవకముందు ఉక్రెయిన్ సైతం అదే విధంగా మాట్లాడింది. ఈ పర్యటనల వెనక ఏమైనా అంతర్యముందా అని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు.


