ఆ రెండు విమాన ప్రమాదాలు.. కాక్‌పిట్‌ రూల్స్‌నే మార్చేశాయి! | Why Two People Must Stay in the Cockpit | Sakshi
Sakshi News home page

ఆ రెండు విమాన ప్రమాదాలు.. కాక్‌పిట్‌ రూల్స్‌నే మార్చేశాయి!

Oct 4 2026 7:01 AM | Updated on Oct 4 2026 7:02 AM

Why Two People Must Stay in the Cockpit

విమాన ప్రయాణంలో ప్రయాణికుల భద్రత కోసం ఎన్నో కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయి. అయితే కాక్‌పిట్‌లోకి బయటివారు ప్రవేశించకుండా తీసుకున్న భద్రతా చర్యలే ఒక్కోసారి కొత్త ప్రమాదాలకు కారణమయ్యాయి. కాక్‌పిట్‌లో ఉన్న వ్యక్తుల్లోనే ఎవరో ఒకరు విమానానికి ముప్పుగా మారితే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్న ప్రశ్నకు గతంలో జరిగిన రెండు ఘోర విమాన ప్రమాదాలు కీలక పాఠాలు నేర్పాయి. ఈజిప్ట్‌ఎయిర్‌ 990, జర్మన్‌వింగ్స్‌ 9525 ప్రమాదాల తర్వాత కాక్‌పిట్‌లో ఎప్పుడూ కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలన్న ఆలోచనకు ప్రాధాన్యత పెరిగింది. తాజాగా ఫ్లై దుబాయ్‌ విమానంలో సహ పైలట్‌ ప్రధాన పైలట్‌పై కాక్‌పిట్‌లో దాడి చేసిన ఘటనతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది.

ఈజిప్ట్‌ఎయిర్‌ 990.. తొలి హెచ్చరిక
1999 అక్టోబర్‌ 31న న్యూయార్క్‌ నుంచి కైరో వెళ్తున్న బోయింగ్‌ 767 విమానంలో 217 మంది ఉన్నారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో కెప్టెన్‌ అహ్మద్‌ అల్‌ హబాషి టాయిలెట్‌కు వెళ్లేందుకు కాక్‌పిట్‌ నుంచి బయటకు వెళ్లారు. దీంతో రిలీఫ్‌ ఫస్ట్‌ ఆఫీసర్‌ జమీల్‌ అల్‌ బతూతి కాక్‌పిట్‌లో ఒంటరిగా మిగిలారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎన్‌టీఎస్‌బీ ప్రకారం.. అల్‌ బతూతి ఆటోపైలట్‌ను ఆపి విమానాన్ని వేగంగా కిందికి మళ్లించారు. కెప్టెన్‌ తిరిగి వచ్చి కాక్‌పిట్‌ తలుపు తెరిచిన తర్వాత ఇద్దరి మధ్య విమాన నియంత్రణ కోసం పోరాటం జరిగింది. కెప్టెన్‌ విమానాన్ని పైకి లేపేందుకు ప్రయత్నించగా, అల్‌ బతూతి కిందికి మళ్లించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి.

217 మంది ప్రాణాలు బలిగొన్న విషాదం
ఈ ఘటన చివరకు తీవ్ర విషాదంగా మారింది. విమానం అట్లాంటిక్‌ మహాసముద్రంలో కూలిపోవడంతో అందులో ఉన్న 217 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంపై దర్యాప్తు సంస్థల మధ్య అభిప్రాయభేదాలు కూడా ఉన్నాయి. అల్‌ బతూతి చర్యలే ప్రమాదానికి కారణమని అమెరికా ఎన్‌టీఎస్‌బీ పేర్కొనగా.. ఈజిప్టు దర్యాప్తు అధికారులు ఎలివేటర్‌ కంట్రోల్‌ వ్యవస్థలో సాంకేతిక లోపాన్ని కారణంగా చూపించారు. కారణంపై వివాదం ఉన్నప్పటికీ, ఒక పైలట్‌ కాక్‌పిట్‌లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏర్పడే ప్రమాదాన్ని ఈ ఘటన విమానయాన రంగం దృష్టికి తీసుకొచ్చింది.

9/11 తర్వాత బలమైన కాక్‌పిట్‌ తలుపులు
2001 సెప్టెంబర్‌ 11 ఉగ్రదాడుల తర్వాత విమాన కాక్‌పిట్‌ల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు కాక్‌పిట్‌లోకి చొరబడకుండా తలుపులను అత్యంత బలంగా, బుల్లెట్‌ నిరోధకంగా రూపొందించి ఆటోమేటిక్‌ లాకింగ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అయితే 2015లో జరిగిన జర్మన్‌వింగ్స్‌ 9525 ప్రమాదంలో ఇదే బలమైన తలుపు మరో సమస్యకు దారితీసింది. బార్సిలోనా నుంచి డుసెల్‌డార్ఫ్‌ వెళ్తున్న ఎయిర్‌బస్‌ ఏ320 విమానంలో కెప్టెన్‌ టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో 27 ఏళ్ల సహ పైలట్‌ ఆండ్రియాస్‌ లుబిట్జ్‌ కాక్‌పిట్‌ను లోపల నుంచి లాక్‌ చేశారు.

జర్మన్‌వింగ్స్‌ విషాదంతో మారిన నిబంధనలు
లుబిట్జ్‌ తీవ్రమైన డిప్రెషన్‌, సైకోసిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతడు విమానాన్ని ఉద్దేశపూర్వకంగా ఫ్రెంచ్‌ ఆల్ప్స్‌ వైపు మళ్లించాడు. బయట ఉన్న కెప్టెన్‌ కాక్‌పిట్‌ తలుపును తెరవడానికి గొడ్డలి, ఇతర భారీ పరికరాలతో ప్రయత్నించినప్పటికీ బలమైన తలుపు తెరుచుకోలేదు. చివరకు విమానం పర్వతాలను ఢీకొనడంతో 150 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన మూడు రోజులకే, 2015 మార్చి 27న యూరోపియన్‌ ఏవియేషన్‌ సేఫ్టీ ఏజెన్సీ (EASA) కాక్‌పిట్‌లో ఎప్పుడూ కనీసం ఇద్దరు అధీకృత వ్యక్తులు ఉండేలా మార్గదర్శకాలను జారీ చేసింది.

మళ్లీ ప్రాధాన్యత పొందిన ‘టూ-పర్సన్‌ రూల్‌’
ఈ నిబంధన ప్రకారం ఒక పైలట్‌ టాయిలెట్‌కు వెళ్లడం వంటి కారణంతో కాక్‌పిట్‌ నుంచి బయటకు రావాల్సి వస్తే.. అతడు బయటకు వెళ్లే ముందు కేబిన్‌ సిబ్బందిలో ఒకరు కాక్‌పిట్‌లోకి వెళ్లాలి. తద్వారా కాక్‌పిట్‌లో ఒక్క పైలట్‌ మాత్రమే మిగలకుండా చూడటం, అతడు లోపల నుంచి తలుపును లాక్‌ చేయకుండా నిరోధించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం. అయితే 2016లో ఈఏఎస్‌ఏ ఈ నిబంధనలో కొంత మార్పు చేసింది. కాక్‌పిట్‌ తలుపును పదేపదే తెరవడం కూడా భద్రతకు కొత్త ప్రమాదం కావచ్చని భావించింది. దీంతో కొన్ని విమానయాన సంస్థలు ఈ విధానాన్ని తొలగించాయి. అయితే 2026 మేలో ఈఏఎస్‌ఏ మార్గదర్శకాలను మళ్లీ సవరించి, పెద్ద వాణిజ్య విమానాల కాక్‌పిట్‌లో ఇద్దరు నిరంతరం ఉండటానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విధానం ఉద్దేశపూర్వక ప్రమాదాలను మాత్రమే కాకుండా, కాక్‌పిట్‌లో ఒంటరిగా ఉన్న పైలట్‌ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయినా లేదా అనారోగ్యానికి గురైనా, మరో సిబ్బంది సహాయంతో వెంటనే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఇదీ చదవండి: ఒళ్లు గగుర్పొడిచే 10 ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఘటనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement