పాక్‌లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం? | Sakshi
Sakshi News home page

Serial Killings of Terrorists: పాక్‌లో వరుస టెర్రరిస్టుల హత్యల వెనుక ఏముంది?

Published Wed, Nov 1 2023 8:00 AM

What is Behind the serial Killings of Terrorists in Pakistan - Sakshi

కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమైన అనంతరం పాకిస్తాన్‌లోనూ అదే తరహా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మౌలానా జియావుర్ రెహ్మాన్ అనే మతపెద్ద కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్‌లోని ఒక పార్కులో పట్టపగలు హత్యకు గురయ్యాడు. రెహ్మాన్ లష్కరే కార్యకర్త. ఇద్దరు గుర్తుతెలియని దుండగులు రెహమాన్‌ను కాల్చిచంపారు. 

రెహ్మాన్ సాయంత్రం వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఈ హత్య జరిగింది. ఈ హత్య అతని బంధువులు, స్నేహితులు, అనుచరులను ఆందోళనకు గురిచేసింది. పాకిస్తాన్‌లో మతపెద్దలు.. మతపరమైన కార్యక్రమాలతో పాటు ఇతర సామాజిక కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్ హత్య తీరులోనే లష్కర్ కార్యకర్త రెహ్మాన్ హత్య జరిగింది. ఉగ్రవాద ఆరోపణలతో భారత్‌ మోస్ట్‌ వాటెండ్‌గా ప్రకటించిన పంజ్వార్‌ను గత మే నెలలో లాహోర్‌లో  గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. 
 

పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, టెర్రర్ బాస్‌లు ఈ రెండు హత్యల్లోనూ సారూప్యతలను గమనించారు. ఈ నేపధ్యంలో ఐఎస్ఐ దాదాపు డజను ‘ఆస్తులను’.. ‘సేఫ్ హౌస్‌’లో ఉంచినట్లు ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్న నిఘా వర్గాలు తెలిపాయి. రావల్‌కోట్‌లో అబూ ఖాసిమ్ కాశ్మీరీ, నజీమాబాద్‌లో ఖరీ ఖుర్రామ్ షాజాద్ అనే మరో ఇద్దరు ఎల్‌ఈటీ కార్యకర్తల హత్యల కారణంగా బహుశా ముందుజాగ్రత్త మరింత అవసరమని ఐఎస్‌ఐ భావించి ఉండవచ్చునని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

ఇటీవలే హత్యకు గురైన రెహ్మాన్‌.. జామియా అబూ బకర్ అనే మదర్సాలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడని సమాచారం. పాకిస్తాన్ పోలీసులు తమ ప్రెస్ నోట్‌లో ఈ హత్యను ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. దేశంలో ఉగ్రవాదుల పాత్రను ఇది సూచిస్తోందని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ పోలీసులు దీనిని టార్గెట్ కిల్లింగ్‌గా పరిగణిస్తున్నారు. రెహ్మాన్ హత్య కరాచీలో మత బోధకులపై వరుస దాడుల్లో భాగమని భావిస్తున్నారు. ఈ బోధకులంతా ఐఎస్‌ఐ ద్వారా ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలను ఏర్పరుచుకున్నారు. వీరు యువతను సమూలంగా మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తగిన శిక్షణ అనంతరం యువతను భారత్‌పై దాడికి పంపిస్తారని తెలుస్తోంది. 

కాగా గత మార్చి 1న, ఐసీ-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ హైజాకర్ అయిన పైలట్ జహూర్ ఇబ్రహీంను కాల్చి చంపారు. ఈ జైషే మహ్మద్ ఉగ్రవాదిపై గుర్తుతెలియని ముష్కరులు అతి సమీపం నుంచి రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ హత్యల పరంపర పాకిస్తాన్ చట్ట అమలు సంస్థలను, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐని కలవరపరిచింది. అయితే ఈ హత్యలు ప్రత్యర్థుల కారణంగా జరిగాయని కూడా ఐఎస్‌ఐ పూర్తిగా విశ్వసించడం లేదు. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో వేచిచూడాలి.
ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌తో యుద్ధం.. హమాస్‌ కీలక ప్రకటన
 

Advertisement
Advertisement