Gaza: హమాస్‌ కీలక ప్రకటన | Hamas Ready To Release Foreigners And Warn Israel Military - Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌తో యుద్ధం.. హమాస్‌ కీలక ప్రకటన

Nov 1 2023 7:08 AM | Updated on Nov 1 2023 8:48 AM

Hamas Ready To Release Foreigners And Warn Israel Military - Sakshi

గాజా ప్రాంతాన్ని శవాల దిబ్బగా మార్చేసిన ఇజ్రాయెల్‌ సైన్యానికి హమాస్‌ సాలిడ్‌ వార్నింగ్‌.. 

ఇజ్రాయెల్‌తో యుద్ధంలో.. హమాస్‌ కీలక ప్రకటన చేసింది. తమ చెరలో ఉన్న బందీల్లో కొందరు విదేశీయులను వదిలిపెట్టేందుకు అంగీకరించింది.  అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న ఒత్తిళ్ల మేరకే హమాస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  అయితే.. గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ బలగాలను మాత్రం వదిలే ప్రసక్తే లేదని హమాస్‌ స్పష్టం చేసింది.

హమాస్‌ సైనిక విభాగం ప్రతినిధి అబు ఒబీదా మంగళవారం ఓ మీడియా సంస్థ ద్వారా మాట్లాడుతూ.. ‘‘రానున్న రోజుల్లో కొందరు విదేశీయులను విడిచిపెడతాం. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం వహిస్తున్న వారికి తెలియజేశాం. మాపై దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్‌ సైన్యాన్ని విడిచిపెట్టేది లేదు. గాజా ప్రాంతాన్ని వాళ్లు నాశనం చేశారు. కాబట్టి, ఇజ్రాయెలీ సైనికులు, సైన్యాధికారుల్ని చంపి అక్కడే పాతేస్తాం. వాళ్ల మృతదేహాలతో గాజా అతిత్వరలో శ్మశానంగా మారబోతోంది’’ అని అన్నారు.

అక్టోబర్‌ 7న హమాస్‌ బలగాలు రాకెట్‌ లాంఛర్లతో ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేశాయి. సరిహద్దులోని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని.. దాదాపు 240 మందిని అపహరించి గాజాలో తమ బందీలుగా చేసుకుంది. వాళ్లలో ఇజ్రాయెల్‌ పౌరులు, సైనికులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. వీళ్లను విడిపించాలని ఇజ్రాయెల్‌లో నిరసనలను తారాస్థాయికి చేరాయి. 

శాంతియుతంగా బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో హమాస్‌ను సర్వనాశనం చేసి మరీ బంధీలను విడిపిస్తామని ఇజ్రాయెల్‌ ప్రతిన బూనింది. గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్‌ దాడి కారణంగా ఇప్పటి వరకు 8,525 మంది మృతి చెందినట్లు హమాస్‌ ఆధీనంలోని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. మృతి చెందిన వారిలో 3,500 మంది చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది. 

పలు దేశాల మధ్యవర్తిత్వం వల్ల ఇప్పటి వరకు హమాస్‌ నలుగురిని విడిచిపెట్టగా.. ఇజ్రాయెల్‌ సైన్యం చేపట్టిన గ్రౌండ్‌ ఎటాక్స్‌లో మరొకరు హమాస్‌ చెర నుంచి విముక్తి పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement