వెనెజువెలాలో సంభవించిన భారీ భూకంపాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అయితే భూకంపాల కంటే ముందే కొందరు ఆండ్రాయిడ్ వినియోగదారుల ఫోన్లకు గూగుల్ నుంచి హెచ్చరిక సందేశాలు రావడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రకంపనలు మొదలుకాక ముందే గూగుల్‌కు ఆ విషయం ఎలా తెలిసి ఉంటుంది అనే ప్రశ్నకు చాలా మంది సమాధానం కోసం వెతుకుతున్నారు..
నిపుణులు చెప్పేది ఏంటంటే.. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లో ఉండే యాక్సిలెరోమీటర్ సెన్సార్‌ను స్క్రీన్ రొటేషన్ కోసం ఉపయోగిస్తుంటారు. అయితే ఇదే సెన్సార్ భూమిలో ఏర్పడే సూక్ష్మ ప్రకంపనలను కూడా గుర్తించగలదు. ఒక ఫోన్ భూకంపానికి సంబంధించిన ప్రకంపనలను గుర్తించిన వెంటనే ఆ సమాచారాన్ని గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్‌కు( Android Earthquake Alerts System)కు పంపిస్తుంది. అలాగని.. కేవలం ఒక ఫోన్ నుంచి వచ్చిన సమాచారంతోనే గూగుల్ నిర్ణయం తీసుకోదు.
అదే ప్రాంతంలో ఉన్న మరిన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి వచ్చే సంకేతాలను విశ్లేషిస్తుంది. ఒకేసారి అనేక ఫోన్లు ఒకే తరహా ప్రకంపనలను నమోదు చేస్తే.. అప్పుడు భూకంపం సంభవిస్తున్నట్లు నిర్ధారించి వినియోగదారులకు హెచ్చరికలు పంపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉండటంతో.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ భూకంప గుర్తింపు వ్యవస్థగా ఏర్పడింది.
అసలు భూకంపం కంటే ముందే హెచ్చరికలు ఎలా వస్తాయన్నది మరింత ఆసక్తికరం. భూకంపం ఒకే దెబ్బగా సంభవించదు. అది తరంగాల రూపంలో వ్యాపిస్తుంది. మొదట వచ్చే పీ-వేవ్స్ వేగంగా ప్రయాణించినప్పటికీ వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఎస్-వేవ్స్ ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఫోన్లు ముందుగా పీ-వేవ్స్‌ను గుర్తించి గూగుల్‌కు సమాచారం పంపుతాయి. మొబైల్ సిగ్నల్స్ కాంతి వేగంతో ప్రయాణించడంతో.. భూకంపం తీవ్ర ప్రకంపనలు ప్రజల వద్దకు చేరుకునేలోపే గూగుల్ హెచ్చరికలు పంపగలుగుతోంది.
ఆండ్రాయిడ్ వ్యవస్థలో బీవేర్ అలర్ట్(Be Aware Alert), టేక్ యాక్షన్ అలర్ట్ (Take Action Alert) అనే రెండు రకాల హెచ్చరికలు ఉంటాయి. ప్రకంపనల తీవ్రతను బట్టి ఈ అలర్ట్‌లు వినియోగదారులకు పంపిస్తారు. అలర్ట్‌పై క్లిక్ చేస్తే భూకంప కేంద్రం, అంచనా తీవ్రతతో పాటు భద్రతా సూచనలు కూడా కనిపిస్తాయి.
ఇదిలా ఉంటే.. ఈ వ్యవస్థ భారత్‌లోనూ 2023 నుంచే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 5 లేదంటే అంతకంటే పై వెర్షన్ ఉన్న ఫోన్లలో ఈ సేవ పనిచేస్తోంది. మొబైల్ డేటా కనెక్షన్ ఉంటే ముందస్తు హెచ్చరికలను అందుకోవచ్చు.
వెనెజువెలా భూకంప ఘటన మరోసారి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. మన చేతిలోని స్మార్ట్‌ఫోన్ కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు.. ప్రాణాలను కాపాడగల అత్యవసర హెచ్చరిక వ్యవస్థలో భాగమని!.


