
ఇరాన్ అణు కేంద్రాలపై 14 బంకర్–బస్టర్ బాంబులు జారవిడిచాం
అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ కెయినీ వెల్లడి
వాషింగ్టన్: ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్’ విజయవంతమైందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డేనియల్ కెయినీ చెప్పారు. ఈ మొత్తం ఆపరేషన్ కేవలం 25 నిమిషాల్లోనే ముగిసిందని తెలిపారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
తమ సైన్యానికి ఇరాన్‌లో గగన తల రక్షణ వ్యవస్థ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదని, ఆపరేషన్ పూర్తయిన వెంటనే తమ విమానాలు క్షేమంగా తిరిగివచ్చా యని స్పష్టం చేశారు. ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామ ర్‌లో ఏడు స్టెల్త్ బి–2 బాంబర్లు పాల్గొన్నాయని తెలిపా రు. ఈ బాంబర్లు 14 భారీ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులను(బరువు 13,600 కిలోలు) ఫోర్డో, నతాంజ్ అణు కేంద్రాలపై జారవిడిచాయని పేర్కొన్నారు. అలాగే టోమాహాక్ క్షిపణులు ఇస్ఫహాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేశాయని వివరించారు.
ఏడు బి–2 స్పిరిట్ బాంబర్లు
‘‘2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత బి–2 స్టెల్త్ బాంబర్లు ఈ స్థాయిలో భారీ ఆపరేషన్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మిస్సోరీ నుచి బాంబర్లు బయలుదేరాయి. అమె రికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6.40 గంటలకు మూడు అణు కేంద్రాలపై దాడులు మొదల య్యాయి. 7.05 గంటలకు మా విమానాలు ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేశాయి. 14 బంకర్– బస్టర్ బాంబులు, 24కుపైగా టోమాహాక్ క్షిపణులు ప్రయో గించాం. పశ్చిమాసి యాలో ఇటీవల ఉద్రిక్తతలు ప్రారంభమైన అనంతరం ఇరాన్‌పై మా అతిపెద్ద దాడి ఇదే. ఏడు బి–2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడ్డాం. ఒక్కోదాంట్లో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. నిశ్శబ్దంగా వెళ్లి పని పూర్తి చేసుకొని వచ్చారు.
కొద్దిమందికే తెలుసు
ఇరాన్‌పై ఆపరేషన్ గురించి అమెరికా ప్రభుత్వ ముఖ్యుల్లో, సైనిక వ్యూహకర్తల్లో చాలా కొద్దిమందికే తెలుసు. అమెరికా జలాంతర్గామి నుంచి ఇస్ఫహాన్ అణు కేంద్రంపై 24కుపైగా టోమాహాక్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్లు ప్రయోగించాం. ఉపరితలంపైనున్న మౌ లిక సదుపాయాలను నేలమట్టం చేశాం. సాయంత్రం 6.40 గంటలకు బి–2 బాంబర్లు రెండు భారీ బంకర్–బస్టర్ బాంబులను ఫోర్డో న్యూక్లియర్ సైట్‌పై జారవిడిచాయి. మిగిలిన బాంబర్లు వాటి లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. చివరి దాడి ఇస్పహాన్‌పై టోమాహాక్ క్షిపణితో జరిగింది. రాత్రి 7.05 గంటల కల్లా ఆపరేషన్ ముగిసింది. ఇరాన్‌కు చెందిన సర్ఫేస్–టు–ఎయిర్ క్షిపణి వ్యవస్థ మా యుద్ధ విమానాల రాకను గుర్తించలేదు’’ అని డాన్ కెయినీ వివరించారు.
ఆపరేషన్ విజయవంతం: పీట్ హెగ్సెత్
ఇరాన్‌పై ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్’ పూర్తిస్థాయిలో విజయవంతమైందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. మూడు ఇరాన్ అణు కేంద్రాలు నాశనమయ్యాయని అన్నారు. ఇరాన్ అణ్వయుధాలు దక్కించుకోవడానికి వీల్లేదని డొనాల్డ్ ట్రంప్ మొదటనుంచీ చెబుతూనే ఉన్నారని గుర్తుచేశారు. ఇరాన్‌తో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. ఇరాన్ ప్రభుత్వం చర్చలకు ముందుకు వస్తుందని భావిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ చెప్పారు. చర్చలకు ఇరాన్‌ను ఒప్పించాలంటూ డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లో ఇప్పటివరకు 430 మంది మరణించారని, 3,500 మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నౌర్‌న్యూస్ వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 24 మంది మృతిచెందారని, 1,272 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.
ఏమిటీ టోమాహాక్ క్షిపణులు?
అమెరికా నావికా దళంలో కీలకమైనవి బీజీఎం–109 టోమాహాక్ ల్యాండ్ అటాక్ లాంగ్‌రేంజ్ మిస్సైళ్లు. యుద్ధనౌకలు, జలాంతర్గాముల నుంచి వీటిని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో భూఉపరితలంపైనున్న లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. 1970వ దశకంలో తొలిసారిగా జనరల్ డైనమిక్స్ కంపెనీ తయారుచేసింది. 12కుపై వేరి యంట్లు ఉన్నాయి. టోమాహాక్ క్షిపణి బరువు 1,300 కిలోలు. బూస్టర్‌తో కలిపి రూ.1,600 కిలోలు. పొడవు 5.56 మీటర్లు గంటకు 920 కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణించి 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.
మాట వినకపోతే మళ్లీ దాడులు: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌లో కీలకమైన అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని, శిథిలా లుగా మార్చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసిన అనంతరం శనివారం రాత్రి ట్రంప్ వైస్‌హౌస్‌లో మాట్లాడారు. అమెరికాపై ప్రతీకార దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను హెచ్చరించారు. శాంతి కావాలో, యుద్ధం కావాలో తేల్చుకోవాలని ఆ దేశానికి సూచించారు. భీకర స్థాయి దాడులతో ఇరాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పే శక్తి అమెరికాకు మాత్రమే ఉందన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఒక దుష్టశక్తిగా మారిందని, ఇతర దేశాలకు ప్రమాదకరంగా పరిణమించిందని మండిపడ్డారు. మాట వినకపోతే ఇకపై జరగబోయే దాడులు మరింత భయాన కంగా ఉంటాయని ఇరాన్‌కు తేల్చిచెప్పారు.
ట్రంప్ నిర్ణయం అద్భుతం: నెతన్యాహూ
జెరూసలేం: ఇరాన్ అణు కేంద్రాలపై అమె రికా దాడి చేయడం పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెత న్యాహు హర్షం వ్యక్తంచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. శాంతి కోసమే ఇరాన్‌పై బలప్రయోగం చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఈ దాడులతో పశ్చిమాసియాలో రాబోయే రోజుల్లో శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం, భద్రత చేకూరుతాయని స్పష్టంచేశారు. నెతన్యాహు ఆదివారం మీడియాతో మాట్లాడారు. చరిత్రను మలుపు తిప్పే నిర్ణయం తీసుకుందని అమెరికాను కొనియాడారు. ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేని సాహసోపేత కార్యాన్ని అమెరికా చేసి చూపించిందని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో ప్రాణాంతక శక్తిగా మారిన ఇరాన్‌కు బుద్ధి చెప్పిన గొప్ప నాయకుడిగా డొనాల్డ్ ట్రంప్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఉద్ఘాటించారు.
బాధ్యతారాహిత్యం
అమెరికాపై రష్యా ధ్వజం
మాస్కో/బీజింగ్: ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై భారీ బాంబులతో అమెరికా జరిపిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే అనేక సంక్షోభాలతో అట్టుకుతున్న పశ్చిమాసియాను మరింత ప్రమాదంలోకి నెట్టడమేనని పేర్కొంది. అమెరికా తన బాధ్యతారాహిత్యంతో అంతర్జాతీయ చట్టాలు, ఐరాస పీఠికను, తీర్మానాలను ఉల్లంఘించిందని మండిపడింది. ‘ఒక సార్వభౌమ దేశంపై క్షిపణులు, బాంబులతో దాడులు చేయడం బాధ్యతారహిత చర్య. దీనిని సమర్థించుకునేందుకు ఎన్ని వాదనలు వినిపించినా సరే, ఇది అంతర్జాతీయ చట్టాలకు ఐరాస చార్టర్, భద్రతా మండలి తీర్మానాలను తీవ్రంగా ఉల్లంఘించడమే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశం ఈ దాడులు చేయడం ఆందోళనకరం’అని అమెరికా పేరును ప్రస్తావించకుండా పేర్కొంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరి కా బాంబు దాడులను చైనా సైతం తీవ్రంగా ఖండించింది. ఐరాస చార్టర్‌ను ఉల్లంఘించిన అమెరికా పశ్చిమాసియాలో ఉద్రిక్తత లను మరింత రాజేసిందని పేర్కొంది.