వాషింగ్టన్ డీసీ: ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక బలగాలను వెనక్కి తీసుకురావాలని ఆదేశించే తీర్మానాన్ని అమెరికా సెనేట్ ఆమోదించింది. ప్రభుత్వ సైనిక అధికారాలపై రెండు ప్రధాన పార్టీలు కలిసి అభ్యంతరం చెప్పిన అరుదైన ఘటనగా ఇది నిలిచింది. అలాగే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనను కాంగ్రెస్ వ్యక్తం చేసింది.
ఈ తీర్మానం 50-48 ఓట్లతో ఆమోదం పొందింది. రిపబ్లికన్ సెనేటర్లు రాండ్ పాల్, సూసన్ కాలిన్స్, లిసా మర్కోవ్‌స్కీ, బిల్ క్యాసిడీ డెమొక్రాట్లకు మద్దతుగా ఓటు వేశారు. డెమొక్రటిక్ సెనేటర్ జాన్ ఫెటర్‌మన్ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇంతకుముందు ఇలాంటి యుద్ధ అధికారాల తీర్మానాలకు వ్యతిరేకంగా ఉన్న రిపబ్లికన్ సెనేటర్లు మిచ్ మెక్‌కానెల్, డేవ్ మెక్‌కార్మిక్ ఈ ఓటింగ్‌కు దూరంగా ఉండటం వల్ల ఈ తీర్మానం ఆమోదం పొందింది.
కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే అధ్యక్షుడి అధికారాన్ని పరిమితం చేయాలని డెమొక్రట్లు చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ ఓటింగ్ జరిగింది. ఇటీవలి వారాల్లో కొందరు రిపబ్లికన్లు కూడా ఈ ప్రయత్నాలకు క్రమంగా మద్దతు పెంచారు. ఈ తీర్మానం ఇంతకుముందు అమెరికా ప్రతినిధుల సభలోనూ 215-208 ఓట్లతో ఆమోదం పొందింది. నలుగురు రిపబ్లికన్లు డెమొక్రట్లతో కలిసి అనుకూలంగా ఓటు వేశారు.
ఆ ఓటింగ్ తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్‌లో చట్టసభ సభ్యులపై విమర్శలు చేశారు. వారిని "గ్రాండ్‌స్టాండర్స్" అని పేర్కొంటూ, వారి చర్యలను "దేశభక్తికి విరుద్ధం" అని అన్నారు. రెండు సభల్లోనూ ఈ తీర్మానం ఆమోదం పొందినా, ఇది ఉమ్మడి తీర్మానం మాత్రమే. అందువల్ల అధ్యక్షుడి సంతకం అవసరం లేదు. దీనికి చట్టబద్ధ అమలు పవర్ కూడా లేదు. సెనేట్ ఓటింగ్‌పై స్పందించిన శ్వేతసౌధ అధికారి ఈ తీర్మాన ప్రాధాన్యాన్ని తగ్గించి చూపించారు.
"ఉమ్మడి తీర్మానాలు అధ్యక్షుడి వద్దకు వెళ్లవు. వాటికి చట్టబద్ధ అమలు శక్తి లేదు" అని ఆ అధికారి తెలిపారు. ఈ తీర్మానం ఎక్కువగా ప్రతీకాత్మకమేనని, కొందరు రిపబ్లికన్ సెనేటర్లు గైర్హాజరు కావటం వల్లే ఇది ఆమోదం పొందిందని కూడా ఆయన అన్నారు.
శ్వేతసౌధం ఏమంటోంది?
ఈ తీర్మానం అధ్యక్షుడు అమెరికా సాయుధ బలగాలను ఇరాన్‌పై జరుగుతున్న శత్రుత్వ చర్యల నుంచి వెనక్కి తీసుకురావాలని ఆదేశిస్తోంది. అయితే, అమెరికా సైన్యాన్ని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. "ఏప్రిల్ 7న కాల్పుల విరమణతో శత్రుత్వ చర్యలు ముగిశాయి. అందువల్ల అమెరికా బలగాలను వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి లేదు" అని అక్కడి మీడియా తెలిపింది.
ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకువచ్చిన డెమొక్రటిక్ సహాయకుడు ఈ అభిప్రాయాన్ని ఖండించారు. ఈ తీర్మానం అమల్లో ఉంటుందని, దీని ప్రభావంపై విభేదాలు వస్తే అది న్యాయపరమైన అంశంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఈ ఏడాది ఆరంభం నుంచి ఇరాన్‌కు సంబంధించిన యుద్ధ అధికారాలపై సెనేట్ ఇప్పటికే 10 సార్లు ఓటింగ్ నిర్వహించింది. గత నెలలో సెనేట్ మద్దతు పొందిన మరో ప్రతిపాదన ముందుకు వెళ్లినా, తుది ఓటింగ్ ఇంకా జరగలేదు. ఆమోదానికి అవసరమైన మద్దతు సమకూర్చేందుకు డెమొక్రటిక్ చట్టసభ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నా, భవిష్యత్తులో ఇరాన్‌కు సంబంధించిన ఏ సైనిక చర్య జరిగినా కాంగ్రెస్ పర్యవేక్షణ ఉండాలని కొందరు డెమొక్రటిక్ సెనేటర్లు పట్టుబడుతున్నారు. ఈ తీర్మానం యుద్ధ అధికారాల సమతుల్యతపై అమెరికా కాంగ్రెస్, అధ్యక్షుడి మధ్య వాషింగ్టన్‌లో కొనసాగుతున్న చర్చకు ప్రతిబింబంగా నిలిచింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో అమెరికా సైనిక ప్రమేయంపై ఈ చర్చ సాగుతోంది.


