అమెరికాలో చట్టసభ్యులపై కాల్పులు  | US politician and husband killed, others injured | Sakshi
Sakshi News home page

అమెరికాలో చట్టసభ్యులపై కాల్పులు 

Jun 15 2025 4:45 AM | Updated on Jun 15 2025 11:54 AM

US politician and husband killed, others injured

మిన్నెసోటా చట్ట సభ్యురాలు, ఆమె భర్త దుర్మరణం 

సెనేటర్‌ దంపతులపైనా దుండగుని కాల్పులు 

పోలీసు వేషంలో ఘాతుకం, కార్లో నేతల చిట్టా

బ్లెయిన్‌/బ్రూక్లిన్‌: అమెరికాలో ఘోరం జరిగింది. ఇద్దరు మిన్నెసోటా రాష్ట్ర చట్టసభల సభ్యులపై ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన రాష్ట్ర ప్రతినిధుల సభ సభ్యురాలు, మాజీ స్పీకర్‌ మెలిసా హార్ట్‌మన్, ఆమె భర్త మార్క్‌ కాల్పులకు బలి కాగా రాష్ట్ర సెనేట్‌ సభ్యుడు, డెమొక్రటిక్‌–ఫార్మర్‌–లేబర్‌(డీఎఫ్‌ఎల్‌) పార్టీ నేత జాన్‌ హాఫ్‌మన్‌ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మిన్నెసోటా రాష్ట్రంలోని బ్రూక్లిన్‌ పార్క్, ఛాంప్లిన్‌ పట్టణాల్లో ఈ దారుణాలు జరిగాయి. 

తొలుత సెనేటర్‌పై... 
దుండగుడు పోలీస్‌ స్క్వాడ్‌ తరహా ఎస్‌యూవీ వాహనంలో పోలీసు యూనిఫాంలో ఘాతుకాలకు పాల్పడ్డాడు. ముందుగా శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో ఛాంప్లిన్‌ పట్టణంలోని సెనేటర్‌ జాన్‌ ఇంటికి వెళ్లాడు. పోలీసు వాహనం, పోలీస్‌ అధికారి యూనిఫాం చూసి జాన్‌ తలుపు తీశారు. వెంటనే దుండగుడు లోనికి చొరబడ్డాడు. జాన్‌ దంపతులపై పలుమార్లు కాల్పులు జరిపి వచ్చిన కార్లోనే పారిపోయాడు. 

రక్తమోడుతున్న జాన్‌ దంపతులను పోలీసులు  వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. పలు సర్జరీల తర్వాత కాస్త కోలుకున్నా వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం తెల్లవారుజామున 3.35 గంటలకు దుండగుడు బ్రూక్లిన్‌ పార్క్‌ పట్టణంలో హార్ట్‌మన్‌ ఇంటికెళ్లాడు. అతన్ని పోలీసుగా భ్రమించి లోపలికి రానిచ్చిన హార్ట్‌మన్‌ దంపతులపై కాల్పులు జరిపాడు. దాంతో వాళ్లు అక్కడిక్కడే మరణించారు. 

అదే సమయానికి సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు హార్ట్‌మన్‌ ఇంటివైపు వచ్చారు. ఇంట్లోంచి బయటికొస్తున్న దుండగుడు వారిపై కాల్పులకు దిగాడు. తర్వాత ఇంటి వెనుక తలుపు గుంఒడా పారిపోయాడు. ఇంటి ముందు నిలిపి ఉంచిన అతని కార్లో పలువురు చట్టసభస భ్యుల పేర్లతో కూడిన చీటీ పోలీసులకు దొరికింది. అబార్షన్‌ చేసే వైద్యులు, వాటిని సమ రి్థంచే లాయర్లు, పలు రాష్ట్రాల చట్టసభల సభ్యులు... ఇలా 70 మంది పేర్లు అందులో ఉన్నాయి. 

తూటాలున్న బ్యాగు కూడా దొరికింది. దుండగున్ని ప్రిటోరియన్‌ గార్డ్‌ సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ పెట్రోల్స్‌ విభాగం డైరెక్టర్‌ వాన్స్‌ బోల్టర్‌ (57)గా అనుమానిస్తున్నారు. అతనికోసం వేట మొదలెట్టారు. ఇవి రాజకీయ ప్రేరేపిత హత్యలేనని మిన్నెసోటా గవర్నర్‌ టిమ్‌ వాల్జ్‌ ఆరోపించారు. దుండగున్ని వెంటనే పట్టుకుంటామని చెప్పారు.

‘నో కింగ్స్‌’ కరపత్రాలూ.. 
దుండగుని కారులో ‘నో కింగ్స్‌’ కరపత్రాలు కూడా కనిపించాయి. అక్రమ వలసదారుల అరెస్టులను నిరసిస్తూ మొదలైన ఉద్యమంలో భాగంగా అమెరికావ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ‘నో కింగ్‌ పేరిట ర్యాలీలు జరుగుతుండటం తెల్సిందే. కాల్పుల ఘటన నేపథ్యంలో మిన్నెసోటాలో ర్యాలీలను విరమించుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement