‘పాక్‌ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దు’

US lawmakers urge Biden not to recognise new Pakistan govt - Sakshi

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న వేళ.. అగ్రరాజ్య చట్ట సభ్యులు పెద్ద షాకే ఇచ్చారు. ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దంటూ అధ్యక్షుడు జో బైడెన్‌కు డెమొక్రటిక్‌ సభ్యులు లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. అమెరికా ఆ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని లేఖలో పేర్కొన్నారు వాళ్లంతా. 

ఫిబ్రవరి 8 నాటి పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగేవరకు కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దని లేఖలో బైడెన్‌ చట్టసభ్యులు కోరారు. ‘‘పోలింగ్‌కు ముందు, తరువాత రిగ్గింగ్‌ జరిగిందనే దానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన దర్యాప్తు జరిగేవరకు వేచి చూడండి. అంతవరకు ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దు. లేనిపక్షంలో ఆ దేశాధికారుల ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సమర్థించినట్లవుతుంది. అది అక్కడి ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తిని తక్కువ చేసినట్లే’’ అని లేఖలో ప్రస్తావించారు వాళ్లు. బైడెన్‌తో పాటు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను ఉద్దేశించి సంయుక్త లేఖ రాశారు వాళ్లు. 

‘‘ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్‌ఖాన్‌కు జైలు శిక్షలు విధించారు. ఆ పార్టీ అభ్యర్థులకు స్వతంత్రులుగా పోటీ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. పీటీఐ శ్రేణులు.. పోలీసు దాడులు, అరెస్టులు, వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల తుది ఫలితాల విడుదలలో జాప్యం అనుమానాలకు కారణమైంది. ఫలితాలు తారుమారైనట్లు ఆరోపణలు ఉన్నాయి’’ అని 33 మంది చట్టసభ్యులు తెలిపారు. ఇందులో ప్రోగ్రెసివ్ కాకస్ ఛైర్‌పర్సన్, భారత సంతతికి చెందిన ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో భారీఎత్తున రిగ్గింగ్‌ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులు గురువారం పార్లమెంటులోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. అదే సమయంలో.. మెజారిటీ రాకపోయినా కూటమి రూపేణా ప్రభుత్వ ఏర్పాటునకు నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్‌ సిద్ధమైంది. షరీఫ్‌ సోదరుడు.. మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆదివారం పాక్‌ నూతన ప్రధానిగా ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పరిణామాల మధ్య అగ్రరాజ్య చట్టసభ్యుల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top