US Gunfire: అమెరికాలో నరమేధం

US Gunfire: Bar struck by Maine mass shooting mourns victims - Sakshi

18 మందిని కాల్చి చంపిన ఉన్మాది

ముందుగా ఆడుకుంటున్న చిన్నారులు, తల్లిదండ్రులపై

అనంతరం సమీపంలోని బార్‌పైకీ కాల్పులు

హంతకుడు సైనికుడు, మానసిక రోగి!

కాల్పులకు దిగుతానంటూ గతంలోనూ బెదిరింపులు

పట్టుకునేందుకు పోలీసుల వేట

లెవిస్టన్‌ (అమెరికా): అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్న ఓ సైనికుడు నరమేధానికి దిగాడు. చిన్నారులు, వారి తల్లిదండ్రులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం పారిపోతూ దార్లోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌పైనా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దారుణాల్లో ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 13 మందికి పైగా గాయపడ్డారు. మెయిన్‌ రాష్ట్రంలోని లెవిస్టన్‌లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి వేళ ఈ ఘోరం జరిగింది.

కాల్పుల అనంతరం చీకటి చాటున తప్పించుకుని పారిపోయిన హంతకుని కోసం భారీ వేట సాగుతోంది. హంతకుడిని 40 ఏళ్ల రాబర్ట్‌ కార్డ్‌గా గుర్తించారు. అతడు అమెరికా ఆర్మీ రిజర్వ్‌లో ఆయుధాల ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నట్టు సమాచారం. కొంతకాలంగా అతను మానసిక సమస్యలతో  బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. హంతకుని ఫొటోను విడుదల చేశారు. అందులో అతను చేతిలో ఆటోమేటిక్‌ రైఫిల్‌తో కన్పిస్తున్నాడు.  హంతకుడు పారిపోయేందుకు ఉపయోగించినట్టుగా భావిస్తున్న కారును ఆండ్రోస్కాగిన్‌ కౌంటీలో స్వా«దీనం చేసుకున్నారు. ఈ దారుణంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మెయిన్‌ గవర్నర్‌తో మాట్లాడారు.

బౌలింగ్‌ పోటీలు జరుగుతుండగా...
కాల్పులు జరిగిన స్పేర్‌టైమ్‌ రిక్రియేషన్, షెమెంగీస్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌ రెస్టారెంట్‌ లెవిస్టన్‌ శివార్లలోని డౌన్‌టౌన్లో ఉన్నాయి. బుధవారం రాత్రి అక్కడి బౌలింగ్‌ ఏరియాలో చిన్నారుల బౌలింగ్‌ లీగ్‌ జరుగుతోంది. ఆటవిడుపుగా దాంట్లో పాల్గొంటున్న పిల్లలు, వారి తల్లిదండ్రులతో సందడిగా ఉన్న సమయంలో రాబర్ట్‌ అందులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.  

హింసాత్మక ప్రవృత్తి
రాబర్ట్‌ది హింసాత్మక ప్రవృత్తి అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తెలిపారు. రెండు వారాల క్రితమే ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కూడా తీసుకున్నాడన్నారు. అతను ఎలాంటి సమస్యతో బాధపడుతున్నాడో చెప్పకపోయినా, కంఠధ్వనులు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.  బౌలింగ్‌ ఏరియాలో కాల్పుల మోతకు జనం వణికిపోయారు. ప్రాణభయంతో చెల్లాచెదురైపోయారు. హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు.  

బెలూన్లను పేలుస్తున్నారనుకున్నాం...
తాను బౌలింగ్‌ ఏరియాలోకి వెళ్లిన కాసేపటికే వెంటవెంటనే కనీసం 10సార్లు తుపాకీ పేలి్చన శబ్దం విన్నట్టు బ్రెండన్‌ అనే వ్యక్తి చెప్పాడు. ‘‘ఆ సమయంలో కాళ్లకు బూట్లు తొడుక్కుంటున్నా. సరదాగా బెలూన్లను పేలుస్తున్నారని తొలుత అనుకున్నా. కానీ డోర్‌ వద్ద చేతిలో తుపాకీతో హంతకున్ని చూసి వణికిపోయా. వెంటనే నేలపై పాక్కుంటూ బౌలింగ్‌ మెషీన్లోకి దూరి దాక్కున్నా. ఐదారు గంటల పాటు ఉత్తకాళ్లతో గడిపా’’అని వివరించాడు.

రెయిలీ దెమోంట్‌ అనే ఆవిడ తల్లిదండ్రులతో కలిసి తన కూతురి ఆట చూస్తోంది. ఆమె తండ్రి రిటైర్డ్‌ పోలీసాఫీసర్‌. ‘‘కాల్పులు మొదలు కాగానే అక్కడున్న వాళ్లందరినీ మా నాన్న హుటాహుటిన ఓ మూలకు తరలించాడు. టేబుళ్లు తదితరాలను వారికి అడ్డుగా పెట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు’’అని చెప్పింది. బార్‌లో కూడా కాల్పుల శబ్దం వింటూనే సిబ్బంది వెంటనే తలుపులన్నీ మూసేసి లోపలున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఎందుకీ కాల్పులు...?
కాల్పులను కళ్లారా చూసిన జోయ్‌ లెవెస్క్‌ అనే పదేళ్ల చిన్నారి ఇప్పటికీ దాన్ని తలుచుకుని వణికిపోతోంది! ‘‘బులెట్‌ నా కాలికి తగులుతూ దూసుకెళ్లింది. ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎవరైనా ఎందుకిలా ప్రవర్తిస్తారు?’’అని ప్రశి్నస్తోంది. కాల్పుల అనంతరం బౌలింగ్‌ ఏరియాలో, రెస్టారెంట్లో ఉన్నవాళ్లందరినీ పోలీసులు సమీపంలోని స్కూలుకు తరలించారు.

 ఈ ఏడాది 36వ ఘటన
అమెరికాలో ఇది ఈ ఏడాదే ఏకంగా 36వ సామూహిక కాల్పుల ఘటన! ఇక మెయిన్‌ రాష్ట్రంలో కాల్పుల్లో ఇంతమంది బలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో 2022 మొత్తంలో పరస్పర కాల్పుల ఘటనల్లో 29 మంది మరణించారు. ఈ రాష్ట్రం వేటకు, షూటింగ్‌ క్రీడలకు ప్రసిద్ధి. అందుకే ఇక్కడ తుపాకీ కోసం లైసెన్సు కూడా అక్కర్లేదు! తుపాకీ కొనేందుకు లైసెన్సును తప్పనిసరి చేసేందుకు జరిగిన ప్రయత్నాలను స్థానిక ప్రజలే వ్యతిరేకించారు. కనీసం కొనుగోలుదారుల నేపథ్యాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయాలన్న ప్రతిపాదనను కూడా బుట్టదాఖలు చేశారు. ఇక కాల్పులు జరిగిన లెవిస్టన్‌ కేవలం 38 వేల జనాభాతో కూడిన చిన్న పట్టణం. ఇక్కడ ప్రధానంగా ఆఫ్రికన్లు నివసిస్తుంటారు. ప్రస్తుతం పట్టణంలో లాక్‌డౌన్‌ విధించారు.

నార్త్‌ కరోలినాలో ఐదుగురు మృతి
క్లింటన్‌: అమెరికాలో గురువారమే మరో కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. నార్త్‌ కరోలినాలోని క్లింటన్‌లో హైవే సమీపంలోని ఓ ఇంట్లో ఐదుగురు తూటా గాయాలతో చనిపోయి కని్పంచినట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఎవరు, ఎందుకు పాల్పడిందీ ఇప్పటికైతే తెలియలేదన్నారు. పరస్పర గొడవలే ఇందుకు దారి తీసి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top