ట్రంప్‌ టారిఫ్‌లకు బ్రేక్‌ | US Federal court blocks Trump from imposing sweeping tariffs | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ టారిఫ్‌లకు బ్రేక్‌

May 30 2025 4:16 AM | Updated on May 30 2025 4:16 AM

US Federal court blocks Trump from imposing sweeping tariffs

అదనపు టారిఫ్‌లను నిలుపుదలచేస్తూ అమెరికా ఫెడరల్‌ కోర్టు సంచలన తీర్పు

అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల కోర్టులో ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ

హద్దు మీరి అధికారాలను వాడారని ట్రంప్‌ను తిట్టిపోసిన న్యాయస్థానం

ట్రంప్‌ వాణిజ్యయుద్ధంలో కీలక మలుపు

చైనా, మెక్సికో, కెనడా, భారత్‌లకు భారీ ఊరట దక్కే అవకాశం

పైకోర్టులో తీర్పును సవాల్‌చేసిన ట్రంప్‌ సర్కార్‌

వాషింగ్టన్‌: సర్వంసహాధిపత్యం కోసం ప్రపంచదేశాలపై టారిఫ్‌ల కొరడాను ఝలిపిస్తున్న అగ్రరాజ్యాధినేత ట్రంప్‌కు అమెరికా ఫెడరల్‌ కోర్టు పగ్గాలువేసింది. యుద్ధంలాంటి అసాధారణ పరిస్థితులులేకపోయినా ఇష్టారీతిగా ప్రపంచదేశాలపై అధిక టారిఫ్‌ల భారం మోపడం చట్టప్రకారం కుదరని న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే మన్‌హాట్టన్‌ ‘యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌’ స్పష్టం చేసింది. 

ట్రంప్‌ వివిధ దేశాలపై అధిక టారిఫ్‌లు విధిస్తూ తీసుకున్న నిర్ణయాలను నిలుపుదలచేస్తూ జడ్జీలు తిమోథీ రెయిఫ్, జేన్‌ రెస్తానీ, గ్యారీ కట్జ్‌మన్‌ల ధర్మాసనం బధవారం రాత్రి సంచలనాత్మక తీర్పును వెలువరించింది. విమోచనం దినం అంటూ దేశ చట్టాలను ట్రంప్‌ తన పరిధిదాటి ప్రయోగించారని న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 

10 రోజుల్లోపు తీర్పులోని అంశాలను సంపూర్ణంగా అమలుచేయాలని ట్రంప్‌ యంత్రాంగానికి న్యాయస్థానం సూచించింది. దీంతో చైనాపై 30 శాతం అదనపు టారిఫ్, మెక్సికో, కెనడాలపై 25 శాతం టారిఫ్‌ అమలు నిలిచిపోనుంది. అయితే వాణిజ్య విస్తరణ చట్టంలోని సెక్షన్‌ 232 ప్రకారం కార్లు, ఆటోరంగ విడిభాగాలు, స్టీల్, అల్యూమినియం తదితరాలపై విధించిన 25 శాతం టారిఫ్‌ మాత్రం కొనసాగనుంది. 

కోర్టు తీర్పులో ఏముంది?
‘‘1977నాటి అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల (ఐఈఈపీఏ) చట్టం ప్రకారం తనకు దఖలుపడిన అధికారాలను మించి మరీ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రపంచదేశాలపై అధిక టారిఫ్‌లను విధిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ భద్రతకు ముప్పు వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అత్యయిక అధికారాలను ప్రయోగించాలి. వాస్తవానికి అత్యయిక అధికారాలను టారిఫ్‌ల కోసం ఉపయోగించకూడదు. వాణిజ్యలోటు అనేది ఏరకంగానూ అత్యయిక స్థితి అనిపించుకోదు. ప్రపంచదేశాల మాదిరిగానే అమెరికా సైతం గత 49 సంవత్సరాలుగా వరసగా వాణిజ్యలోటును చవిచూస్తోంది. 

హఠాత్తుగా వాణిజ్యలోటును సాకుగా చూపి అత్యయిక అధికారాలను ఇలా టారిఫ్‌ల విధింపు కోసం దుర్వినియోగం చేయకూడదు. అత్యయిక అధికారాలను అధ్యక్షుడు ఏకపక్షంగా తీసుకోకూడదు. అపరిమితంగా టారిఫ్‌ల విధింపు అధికారాన్ని ప్రదర్శించి అధ్యక్షుడు రాజ్యాంగంలోని ఇతర ప్రధానాంగాల అధికారాన్ని ఉద్దేశపూర్వకంగా లాక్కున్నారు. ఇది రాజ్యాంగవిరుద్దం. అధ్యక్షుడి ధోరణి మేం ఏమాత్రం అనుమతించబోం. ఆర్థిక సంక్షోభాలొచ్చినా అధ్యక్షుడు రాజ్యాంగానికి లోబడే నిర్ణయాలు తీసుకోవాలి. ఏప్రిల్‌ రెండో తేదీన అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలను నిలుపుదలచేస్తున్నాం’’ అని న్యాయమూర్తులు స్పష్టంచేశారు.

ప్రభుత్వ వాదనలు బుట్టదాఖలు
విదేశాలకు తరలిపోయిన ఫ్యాక్టరీలు, కంపెనీల్లో ఉద్యోగాలను తిరిగి అమెరికాకు రప్పించేందుకే టారిఫ్‌ల అస్త్రాన్ని వాడుకున్నట్లు పదేపదే ట్రంప్‌ యంత్రాంగం చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దేశ వాణిజ్యలోటు జాతీయ అత్యయిక స్థితిగా తయారవడంతో అమెరికాకు అనుకూలంగా వాణిజ్య నిర్ణయాలు తీసుకునేలా ఆయా దేశాలను భయపెట్టేందుకు, ఒప్పించేందుకు టారిఫ్‌ల ఆయుధాన్ని ఉపయోగించామని ప్రభుత్వంచేసిన వాదనను న్యాయస్థానం పట్టించుకోలేదు. 1971లోనూ నాటి అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ఇలా టారిఫ్‌లపై అత్యయిక అధికారాలను ఉపయోగించారు. 

ఈ అధికారాలను సవాల్‌చేసే అధికారం కోర్టులకు లేదని, కేవలం పార్లమెంట్‌ మాత్రమే ప్రశ్నించగలదని ట్రంప్‌ సర్కార్‌ చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. తీర్పు తర్వాత వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి కుశ్‌ దేశాయ్‌ మాట్లాడారు. ‘‘ వాణిజ్యలోటు వంటి ఎమర్జెన్సీ పరిస్థితిని ఎలా చక్కబెట్టాలో నిర్ణయించాల్సింది ఇలాంటి జడ్జీలుకాదు. అదనపు పన్నులు విధించేందుకు ప్రభుత్వం తనకున్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోదు. 

ఎలాగైనా పన్నులు కొనసాగేలా చేసి దేశ వాణిజ్యలోటును తగ్గిస్తాం. మళ్లీ అమెరికాను గొప్పదానిలా మారుస్తాం’’ అని అన్నారు. అయితే కోర్టు తీర్పును గౌరవించి ట్రంప్‌ ప్రభుత్వం ఈ కొత్త టారిఫ్‌ల అమలును నిలుపుదల చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. తీర్పును వెనువెంటనే ప్రభుత్వం వాషింగ్టన్‌ డీసీలోని ‘యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ ఫర్‌ ది ఫెడరల్‌ సర్క్యూట్‌’ కోర్టులో సవాల్‌చేసింది. బుధవారం తీర్పు చెప్పిన జడ్జీ తిమోధీని ట్రంప్, జడ్జీ రెస్తానీని నాటి అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్, జడ్జీ గ్యారీని నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నియమించారు.

ప్రభుత్వం ఇప్పుడేం చేయొచ్చు?
తీర్పు అమలుకు కోర్టు 10 రోజుల గడువు ఇచ్చినందున ఈలోపు పైకోర్టు లో కేసు వాదనకు వచ్చేలాచేసి తీర్పు అమలుకాకుండా నిలుపుదల కోరొచ్చు. లేదంటే ఇప్పటికే అదనంగా వసూలుచేసిన టారిఫ్‌లను అమెరికా తిరిగి ఆయా దేశాలకు వడ్డీ కలిపిమరీ ఇచ్చేయాల్సి ఉంటుంది. తీర్పులో ట్రంప్‌ ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఇచ్చింది.

 నిజంగానే దేశం అత్యంత క్లిష్టమైన వాణిజ్యలోటును ఎదుర్కొంటుంటే 1974నాటి వాణిజ్యచట్టంలోని సెక్షన్‌ 122 ప్రకారం అధ్యక్షుడు తనకు దఖలు పడిన అసాధారణ అధికారాలతో విదేశాలపై 15 శాతం వరకు అదనపు టారిఫ్‌లు విధంచవచ్చు. అయితే అవి తాత్కాలికమే. గరిష్టంగా 150 రోజులపాటు మాత్రమే ఈ అదనపు టారిఫ్‌లు అమలవుతాయి. 1977నాటి అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం పాచిక పారని కారణంగా ఈసారి వాణిజ్య చట్టం,1974 సెక్షన్‌ కింద టారిఫ్‌లు విధించాలని ట్రంప్‌ కొత్త ఎత్తుగడ వేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement