వాషింగ్టన్: ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మిత్రుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండగా ఎవరైనా భారత్‌పై దాడి చేయడానికి సాహసిస్తే తాము వెంటనే రంగలోకి దిగి వారి అంతు చూస్తామని ట్రంప్ హెచ్చరించారు. భారత్‌కు అండగా ఉంటామని కీలక హామీ ప్రకటించారు. మోదీ పదవిలో ఉండగా భారత్ వైపు కన్నెత్తి చూడొద్దని ముష్కరులను హెచ్చరించారు. భారత్‌తో తమకు అధికారికంగా రక్షణ ఒప్పందం లేకపోయినప్పటికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు.
ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్, అమెరికాల మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. మోదీ నాకు గొప్ప మిత్రుడు. మా మధ్య ఇంతకంటే సన్నిహిత సంబంధం ఉండడం అసాధ్యం. మోదీ ఉన్నంతకాలం భారత్‌కు నా మద్దతు ఉంటుంది. మోదీ స్థానంలో ఎవరైనా కొత్త నాయకుడు వస్తే ఆప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు. మోదీ నాయకత్వంలో భారతదేశం మరింతగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆయన నాయకుడిగా ఉన్నంత కాలం భారత్ అద్భుతంగా రాణిస్తుంది’ అని స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన సంకేతంగా భావిస్తున్నప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యల్లో మోదీ వ్యక్తిగత నాయకత్వంపై ప్రత్యేక ప్రశంసలు కనిపించడం విశేషంగా మారింది.
ఇక, అంతకుముందు.. భారత ప్రధాని మోదీతో అద్భుతమైన సమావేశం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. సమీప భవిష్యత్తులో భారత్‌లో పర్యటిస్తానని చెప్పారు. ‘‘మోదీ చాలా మంచి మనిషి, సౌమ్యుడు, నెమ్మదస్తుడు అని అంటుంటారు. మోదీ అత్యంత అందమైన వ్యక్తి. చూడ్డానికి చాలా బాగుంటారు. మోదీని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. కానీ, నిజానికి నా దృష్టిలో ఆయన చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్. వ్యాపారం, వాణిజ్య చర్చల్లో మోదీ చాలా కఠినంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ఆయనకు భారతీయ ప్రజలంటే ఇష్టం, అలాగే అమెరికా అంటే కూడా ఇష్టమే’ అని వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా అభివర్ణించారు. భారత్ ఒక పెద్ద పాత్రను పోషించబోతోంది’ అని అన్నారు.


