భారతీయులు ఖర్చు పెట్టరు.. వాన్స్‌ ప్రతిపాదనపై ట్రంప్‌ వ్యాఖ్య | Ukraine Crisis: They Wont Pay Trump Laughs Off Vance India Troops Plan | Sakshi
Sakshi News home page

భారతీయులు ఖర్చు పెట్టరు.. వాన్స్‌ ప్రతిపాదనపై ట్రంప్‌ వ్యాఖ్య

Jun 24 2026 11:01 AM | Updated on Jun 24 2026 11:34 AM

Ukraine Crisis: They Wont Pay Trump Laughs Off Vance India Troops Plan

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు చేసిన ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. పుతిన్‌-జెలెన్‌స్కీల మొండిపట్టుతో ఆ చర్చలు ముందుకు సాగడం లేదు. అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించి వైట్‌హౌజ్‌లో జరిగిన ఓ ఆసక్తికర చర్చ ఇప్పుడు బయటకు వచ్చింది.  యుద్ధ విరమణ ఒప్పందాన్ని పర్యవేక్షించేందుకు నాటో దేశాల బలగాల బదులుగా భారత సైన్యాన్ని వినియోగించవచ్చనే ప్రతిపాదన వచ్చిందట. దానికి ట్రంప్‌ షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చినట్లు ఇప్పుడు బయటకు వచ్చింది. 

జూన్‌ 23న విడుదలైన రిజిమ్‌ చేంజ్‌ (Regime Change) పుస్తకాన్ని జర్నలిస్టులు మ్యాగీ హాబర్‌మన్‌, జోనాథన్‌ స్వాన్‌ రచించారు. ఇందులో 2025 జనవరి 30న ఓవల్‌ ఆఫీస్‌లో జరిగిన సమావేశం గురించి వివరించారు. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కేవలం పది రోజుల తర్వాత ఈ సమావేశం జరిగినట్లు పేర్కొన్నారు.

ఆ సమావేశంలో.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు ప్రత్యేక దూతగా నియమితులైన రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ కీత్‌ కెలాగ్‌ శాంతి ప్రణాళికను వివరించారు. ఆ ప్రణాళికలో యుద్ధ విరమణ అమలును పర్యవేక్షించేందుకు ఫ్రాన్స్‌, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌ వంటి యూరోపియన్‌ దేశాల బలగాలను ఉక్రెయిన్‌లో మోహరించే ప్రతిపాదన చేశారు.

అయితే నాటో సభ్య దేశాల సైన్యం ఉక్రెయిన్‌లో ఉంటే రష్యా దానిని రెచ్చగొట్టే చర్యగా పరిగణించే అవకాశం ఉందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అభ్యంతరం వ్యక్తం చేశారట. అలా చేస్తే ఉద్రిక్తతలు మరింత పెరిగి యుద్ధం విస్తరించే ప్రమాదం ఉందని ఆయన భావించారట. దీంతో నాటోకు చెందని దేశాల బలగాలను ఉపయోగించవచ్చా? అని వాన్స్‌ ప్రశ్నించగా.. అప్పటి జాతీయ భద్రతా సలహాదారు మైకేల్‌ వాల్ట్జ్‌ కూడా ఆ ఆలోచనకు సానుకూలంగా స్పందించారు. అనంతరం భారత్‌, సౌదీ అరేబియా వంటి దేశాల బలగాలను పరిగణనలోకి తీసుకోవచ్చని వాన్స్‌ సూచించారట.

అయితే ట్రంప్‌ వెంటనే ఆ ప్రతిపాదనను తోసిపుచ్చినట్లు బిగ్గరగా నవ్వినట్లు.. రిజిమ్‌ చేంజ్‌ రచయితలు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, మోదీ తనను ఇష్టపడతారని చెప్పినప్పటికీ, "భారతీయులు అలాంటి వాటికి ఖర్చు పెట్టరు. వారు దీనికి డబ్బులు వెచ్చించరు" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించినట్లు పుస్తకంలో వెల్లడించారు.

అమెరికాకు ఆర్థిక బాధ్యతలు పెరగకూడదనే అంశంపైనే ట్రంప్‌ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పుస్తకం చెబుతోంది. బ్రిటన్‌ లేదంటే ఫ్రాన్స్‌ తమ సొంత నిర్ణయంతో బలగాలను పంపితే తనకు అభ్యంతరం లేదని, కానీ అమెరికా నేరుగా ఇందులో భాగస్వామి కాకూడదని ఆయన భావించినట్లు వివరించింది. అదే సమావేశంలో ట్రంప్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీపై కూడా తీవ్ర విమర్శలు చేసినట్లు పుస్తక రచయితలు పేర్కొన్నారు. జెలెన్‌స్కీని తట్టిపోయడమే కాకుండా.. ఉక్రెయిన్‌ను ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరమైన దేశాల్లో ఒకటిగా వ్యాఖ్యానించినట్లు వెల్లడించారు.

అయితే ఇవన్నీ కొత్తగా విడుదలైన పుస్తకంలోని వాదనలు మాత్రమే. వైట్‌హౌస్‌ లేదంటే సంబంధిత వర్గాలు ఈ వివరాలపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయినప్పటికీ, ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికా విదేశాంగ విధానం, భారత్‌తో ట్రంప్‌ సంబంధాలపై ఈ పుస్తకం కొత్త చర్చకు తెరలేపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement