
రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైంది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు హవాయిలోని కొన్ని ప్రాంతాలకు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు.
పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరానికి తూర్పున 143 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి ముందు దాదాపు గంట సమయంలోనే ఈ ప్రాంతంలో ఐదు భూకంపాలు నమోదైనట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది.
ఈ భారీ భూకంపాలు.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:28 నుంచి 3:49 గంటల మధ్య సంభవించాయి. ఈ భూకంపాల కారణంగా కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని, అయితే ప్రాణ నష్టం గురించి ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం వెల్లడికాలేదు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.