ట్రంప్‌-మమ్దానీ భేటీ.. ఆల్‌ ఈజ్‌ వెల్‌ | Trump Zohran Mamdani First Meeting All is Well | Sakshi
Sakshi News home page

ట్రంప్‌-మమ్దానీ భేటీ.. ఆల్‌ ఈజ్‌ వెల్‌

Nov 22 2025 7:04 AM | Updated on Nov 22 2025 7:09 AM

Trump Zohran Mamdani First Meeting All is Well

నిన్న మొన్నటిదాకా ఒకరి మీద మరొకరు కారాలు మిరియాలు నూరుకున్న ట్రంప్‌-జోహ్రాన్‌ మమ్దానీలు ఎట్టకేలకు చేతులు కలిపారు(షేక్‌ హ్యాండ్‌తో). శ్రుతి మించి తిట్టుకున్న వీళ్లు.. ఇప్పుడేమో ఒకరి మీద ఒకరు ప్రశంసలు గుప్పించుకున్నారు. పైగా తలుపులు బిగించి నిర్వహించిన సమావేశం చాలా గొప్పగా జరిగిందంటూ ప్రకటించుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీ భేటీ అయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం వైట్‌హౌజ్‌ ఓవల్‌ ఆఫీస్‌లో ఈ భేటీ జరిగింది. సాధారణంగా.. తనకు నచ్చని వాళ్లను వైట్‌హౌజ్‌కు ఆహ్వానించి మరీ అవమానించడం ట్రంప్‌ స్టైల్‌. అలాంటిది ప్రపంచమంతా ఊహించిన దానికంటే భిన్నంగా మమ్దానీతో ట్రంప్‌ భేటీ జరగడం గమనార్హం.

న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికల ప్రచార సమయం నుంచి ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. వలసలు, ఆర్థిక విధానాలపై ఇద్దరూ పరస్పర విమర్శలు గుప్పించుకున్నారు.  ట్రంప్ మమ్దానిని “రాడికల్ లెఫ్ట్ లూనాటిక్” అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. మమ్దానీ కూడా ట్రంప్‌ను ఉద్దేశించి నియంత అంటూ నానా తిట్లు తిట్టాడు. దీంతో సహజంగానే ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే..  

ఇప్పుడు అవన్నీ మరిచిపోయి నగర అభివృద్ధికి కృషి చేయాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. మా మధ్య భేటీ చాలా గొప్పగా జరిగింది అంటూ మమ్దానీ పక్కన నిల్చుని ఉండగా తన డెస్క్‌ మీద కూర్చుని ట్రంప్‌ ప్రకటన చేశారు. మనం ఊహించిన దానికంటే ఎక్కువ విషయాల్లో ఏకీభవించాం. మనం ఇద్దరం న్యూయార్క్‌ ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాం అని అన్నారు. మమ్దానీ కూడా ఆ వ్యాఖ్యలతో ఏకీభవించినట్లు వ్యాఖ్యానించారు. ఈ భేటీ ఫలవంతంగా జరిగినట్లు ప్రకటించాడు.

భేటీ జరగడానికి కొన్ని గంటల ముందు కూడా.. ‘‘మా దారులు వేరైనా.. మా లక్ష్యం మాత్రం ఒక్కటే. బలమైన న్యూయార్క్‌ను నిర్మించాలని కోరుకుంటున్నాం. అతడిది భిన్నమైన ఫిలాసఫీ. నాతో పోలిస్తే భిన్నమైంది. అతడి పోరాటాన్ని అభినందిస్తా. ఇలాంటి ప్రయాణం అంత సులభం కాదు. కానీ, అతడు విజయవంతమయ్యాడు. ఇక నుంచి మేమిద్దరం బాగానే ఉంటామని అనుకుంటున్నా’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ జోక్‌తో.. 
భేటీ ముగిశాక మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్‌.. ట్రంప్‌ను నియంత అన్నవ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా? అని మమ్దానీని ప్రశ్నించాడు. దానికి ఆయన సమాధానం ఇవ్వబోతుండగా.. ‘‘అవునను.. ఓ పనైపోతుంది.. నేనేమనుకోను’’ అంటూ పక్క నుంచి ట్రంప్‌ తట్టి చెప్పాడు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి.

 

న్యూయార్క్ సిటీకి 2026 ఆర్థిక సంవత్సరంలో ఫెడరల్ ప్రభుత్వం $7.4 బిలియన్ నిధులు కేటాయిస్తోంది. ఎన్నికల సమయంలో.. మమ్దానీ గనుక గెలిస్తే ఈ నిధులను నిలిపివేస్తానని ట్రంప్‌ హెచ్చరించారు. అయితే.. కాంగ్రెస్ ఆమోదించిన నిధులను నిలిపివేయడానికి ఆయనకు చట్టపరమైన అధికారం స్పష్టంగా లేదు. తాజా భేటీ నేపథ్యంలో ఆ నిధుల విడుదలకు లైన్‌ క్లియర్‌ అయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతకు ముందు.. న్యూయార్క్ సిటీకి కొత్తగా ఎన్నికైన మేయర్ జోహ్రాన్ మమ్దానీని అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా లోనికి ఆహ్వానించారు. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి భుజం తట్టి విజయానికి గానూ ప్రశసించారు. ఆ సమయంలో ఓవెల్‌ ఆఫీస్‌ బయట ఉన్న కొందరు కేకలు వేస్తూ కోలాహలం చేశారు.

భారత మూలాలు ఉన్న జోహ్రాన్‌ మమ్దానీ ఉగాండాలో పుట్టారు. ప్రఖ్యాత చరిత్రకారుడు మహమూద్ మమ్దానీ, ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్‌ల సంతానం ఈయన. న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్‌గా చరిత్ర సృష్టించారు. సోషల్‌ మీడియాలో మాంచి ఫాలోయింగ్‌ ఉన్న మమ్దానీ.. ప్రచారంలోనూ వైవిధ్యతను కనబరిచి ఓటర్లను ఆకట్టుకోగలిగారు. మమ్దానీ తన మేయర్ పదవిని జనవరి 1న స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement