ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాయిలర్ పేలడంతో 15 మంది మృతి చెందారు. పంజాబ్ ప్రావిన్స్ తూర్పు ప్రాంతం ఫైసలాబాద్‌లోని గ్లూ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత ప్రమాద స్థలం నుంచి ఫ్యాక్టరీ యజమాని పరార్ అవ్వగా.. ఫ్యాక్టరీ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ భవనంతో పాటు సమీపంలో ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. పేలుడుకు కారణాలు తెలియరాలేదు. బాయిలర్ పేలడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
అయితే, తగిన భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల పరిశ్రమల్లో తరచుగా ప్రాణనష్టం జరుగుతోందని స్థానిక మీడియా చెబుతోంది. 2024లో ఫైసలాబాద్‌లోని ఒక టెక్స్టైల్ మిల్లులో జరిగిన బాయిలర్ పేలుడు కారణంగా 12 మంది కార్మికులు గాయపడ్డారు. గత వారం కరాచీలోని ఒక పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి నలుగురు కార్మికులు మృతి చెందారు.


