
ట్రంప్ సర్కారు తాజా హెచ్చరికలు
రద్దుకు దారితీసే కారణాలతో జాబితా
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వలస విధానాలు భారతీయులతో సహా అమెరికాలోని వేలాది మంది గ్రీన్‌కార్డు హోల్డర్లలో గుబులు రేపుతున్నాయి. వలసదారులు అమెరికాలో అతిథుల్లా ప్రవర్తించాలని ట్రంప్ సర్కారు తాజాగా హితవు పలికింది. ‘‘లేదంటే గ్రీన్‌కార్డ్ కోల్పోతారు. అంతేకాదు, దేశం నుంచి బహిష్కరణకు గురవుతారు’’అంటూ హెచ్చరించింది. గ్రీన్‌కార్డుదారులు అమెరికా చట్టాలు, విలువలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
శాశ్వత నివాస హక్కు రద్దుకు దారితీసే కారణాల జాబితాను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) విడుదల చసింది. విదేశీయులు చట్టాన్ని ఉల్లంఘిస్తే గ్రీన్ కార్డులు, వీసాలు రద్దు చేస్తామని తెలిపింది. ‘‘అమెరికా చట్టాలను, విలువలను గౌరవించాలి. హింసను సమర్థిస్తే, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తే, అలా చేయాల్సిందిగా ఇతరులను ప్రోత్సహిస్తే అమెరికాలో ఉండటానికి అర్హులు కాదు.
గ్రీన్‌కార్డుదారులను కూడా కఠినంగా తనిఖీ చేయడానికి ఏజెన్సీలకు అధికారముంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీతో కలిసి దీనిపై నిరంతరం పనిచేస్తున్నాం. అమెరికాను మళ్లీ సురక్షితంగా తీర్చిదిద్దడానికి ఈ అప్రమత్తత చాలా అవసరం’’అని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది. ఈ విధానాలను ప్రకటించిన అనంతరం విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. అమెరికా ఔదార్యాన్ని దురి్వనియోగం చేసే శకం ముగిసిందన్నారు. ట్రంప్ సర్కారు తాజా హెచ్చరికలు గ్రీన్‌కార్డ్‌దారుల్లో ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.
అమెరికాలోని భారతీయులకు అక్కడ గ్రీన్‌కార్డ్, శాశ్వత నివాసం పొందడం ఇప్పటికే క్లిష్టంగా మారింది. ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం ఏకంగా 50 ఏళ్లు, అంతకు మించి ఎదురు చూడాల్సిన పరిస్థితి! తీరా శాశ్వత నివాసాన్ని పొందినా అమెరికాలో భవిష్యత్తుకు భద్రత లేదని, చిన్న పొరపాటు చేసినా దేశ బహిష్కారానికి దారి తీయొచ్చని కొత్త నిబంధనలు సూచిస్తున్నాయి. పాత నిబంధనల ప్రకారం వీసా రద్దు తదితరాల విషయంలో వలసదారులకు చట్టపరమైన రక్షణ ఉంది. కొత్త విధానంలో దాన్ని తొలగించారు. అప్పీల్ కూడా లేకుండా వీసా రద్దుకు, బహిష్కరణకు వీలు కల్పించారు.