వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును అమెరికా బాయ్‌కాట్ చేస్తున్నట్టు ట్రంప్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో జీ-20 గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికాను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇందుకు గల కారణాలను ట్రంప్ వెల్లడించారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా..‘జీ-20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరగడం పూర్తిగా అవమానకరం. ఆ దేశంలో మైనార్టీలు అయిన తెల్లజాతి రైతులపై హింస, ఆస్తుల స్వాధీనం, హత్యలు జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న దారుణాలు ప్రపంచానికి తెలియాలి. అందుకే అమెరికా జీ-20 సదస్సుల్లో అమెరికా పాల్గొనడం లేదు. జీ-20 దేశాల అధినేతల సదస్సుకు అమెరికా నుంచి ఎవరూ హాజరు కావడం లేదు. ఈ సదస్సును బహిష్కరిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.
అయితే, ఇటీవల మియామిలో చేసిన ప్రసంగంలో దక్షిణాఫ్రికాను జీ-20 గ్రూప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన ట్రంప్, తాజాగా అక్కడ జరిగే సదస్సును బహిష్కరించాలని నిర్ణయించారు. కాగా, తెల్లజాతి ఆఫ్రికన్ రైతులు దక్షిణాఫ్రికాలో దాడులకు గురవుతున్నారని, అక్కడి సర్కారు వారిని రక్షించడంలో విఫలమైందంటూ ఆరోపించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన తెల్లజాతీయుల కోసం ట్రంప్ ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. వలసదారులకు ఆశ్రయం ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ట్రంప్‌కు దక్షిణాఫ్రికా కౌంటర్..
అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ దేశంలో తెల్లజాతి ప్రజలు ఇప్పటికీ నల్లజాతి ప్రజల కంటే ఎక్కువ స్థాయి జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారని స్పష్టం చేసింది. తెల్లజాతి రైతులపై వివక్ష, హింస జరుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తప్పుడు సమాచారం అందినట్లు తెలిపింది.
నవంబర్ 22-23 తేదీల్లో సదస్సు..
ఇక, జీ-20 సదస్సు ఈ ఏడాది నవంబర్ 22-23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. ఈ సదస్సు ఆఫ్రికా ఖండంలో జరగడం ఇదే మొదటిసారి. వాస్తవానికి ట్రంప్ ఇప్పటికే తాను జీ-20 సదస్సుకు హాజరు కావట్లేదని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు వాన్స్ కూడా తన ప్రయాణాన్ని రద్దు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రారంభంలో జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బహిష్కరించారు.


