
న్యూయార్క్/వాషింగ్టన్: భారత్-పాక్‌ల మధ్య యుద్ధ విరమణకు సయోధ్య కుదిర్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు పాడినపాటే పాడారు. భారత్-పాకిస్తాన్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణలను ఆపానని ట్రంప్ మళ్లీ ప్రస్తావించారు.
మే 10న వాషింగ్టన్ మధ్యవర్తిత్వంలో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత భారత్-పాక్‌లు సంపూర్ణ, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ట్రూత్‌లో ప్రకటించారు. ఆ తరువాత కూడా ట్రంప్ పలు సందర్భాల్లో తన వాదనను పునరావృతం చేస్తూ వస్తున్నారు. భారతదేశం- పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య వివాదాలను ముగించినందుకు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కోరిన దరిమిలా ట్రంప్ మళ్లీ ఇదే వాదన చేశారు.
తాజాగా ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ముగింపజేయడం, ఇరాన్ అణు సామర్థ్యాలను తుడిచిపెట్టడం, గొప్ప ఆర్థిక వ్యవస్థను సృష్టించడం లాంటి ఘనమైన పనులను చేశానని పేర్కొన్నారు. న్యూస్‌మాక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ తాను చాలా యుద్ధాలను పరిష్కరించానని అన్నారు. వాటిలో భారత్-పాక్ మధ్య జరగబోయే అణు యుద్ధం ఒకటని పేర్కొన్నారు. థాయిలాండ్- కంబోడియా, కాంగో -రువాండా మధ్య నెలకొన్న వివాదాలను కూడా తానే పరిష్కరించానని చెప్పుకొచ్చారు.
ఈ యుద్ధాలను వాణిజ్యంతో పరిష్కరించానని, నెలకు సగటున ఒక యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధాలను ముగింపజేస్తూ, లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నానన్నారు. కాగా ఆగస్టు ఒకటి నుండి భారతదేశం నుండి వచ్చే అన్ని వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అలాగే రష్యన్ ముడి చమురు, సైనిక పరికరాలను భారత్ కొనుగోలు చేసినందుకు వెల్లడించని జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మందిని బలిగొన్న ఉగ్ర దాడి తర్వాత అందుకు ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేయాలని ఏ దేశ నాయకుడూ భారతదేశాన్ని కోరలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. అలాగే రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన ప్రత్యేక చర్చలో జోక్యం చేసుకున్న విదేశాంగ మంత్రి జైశంకర్.. ఉగ్రదాడి జరిగిన ఏప్రిల్ 22 మొదలు జూన్ 16 మధ్యకాలంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని పేర్కొన్నారు.