
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1 బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో వైట్‌హౌస్ కీలక ప్రకటన చేసింది.
నేటి నుంచి హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి లక్ష డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ పెంపు కొత్తగా దరఖాస్తు చేసే విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే హెచ్1-బీ వీసా ఉన్నవారికి తాజా పెంపు వర్తించదని తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు తాజాగా విడుదల చేసిన ‘ప్రోక్లమేషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్‌ఇమ్మిగ్రెంట్ వర్కర్స్’ ప్రకటన ప్రకారం హెచ్ 1బీ వీసాలపై కీలకమైన పరిమితులు విధించింది. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గ దర్శకాల ప్రకారం.. హెచ్ 1 బీ వీసా పొందిన ఈ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది.
మినహాయింపులు:
అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలు
అమెరికాలో స్థిర నివాసం ఉన్న వ్యక్తులు
వ్యవసాయం, మాంసం ప్రాసెసింగ్, ప్యాకింగ్ హౌసులు, రవాణా వంటి రంగాల్లో పనిచేసే కార్మికులకు మినహాయింపు
ఆరోగ్య సంరక్షణ రంగంలోకి వచ్చే ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది.
ఈ నిబంధనలు అమెరికాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కొత్త వీసా దారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే దాఖలైన కానీ ఇంకా వీసా పొందని ధరఖాస్తు దారులకు మాత్రమే వర్తిస్తుంది.

ఏమిటీ హెచ్–1బీ వీసా?
విదేశీ నిపుణులను అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడానికి వీలుగా 1990వ దశకంలో అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టం ద్వారా హెచ్–1బీ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలతో లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు. ఇక్కడే స్థిరపడ్డారు. క్రమంగా పౌరసత్వం కూడా పొందారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం 2 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్ల (రూ.1.76 లక్షలు– రూ.4.40 లక్షలు) దాకా ఉంది. తొలుత మూడేళ్ల కాలానికి హెచ్–1బీ వీసా జారీ చేస్తారు. అవసరాన్ని బట్టి మరో మూడేళ్లు పొడిగిస్తారు. ఈ వీసాలతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారత నిపుణులే.
ఆ తర్వాత చైనా నిపుణులు ఉంటున్నారు. భారత్‌లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన విద్యార్థుల కల హెచ్–1బీ వీసా అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి తెలియనివాళ్లు దాదాపు ఉండరు. సాధారణంగా హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజుతోపాటు ఇతర రుసుములను కంపెనీలే భరిస్తాయి. ఇకపై దీనికోసం ఏటా ఒక్కో విదేశీ ఉద్యోగిపై రూ.88 లక్షలకుపైగా చెల్లించాల్సి రావడం అమెరికా సంస్థలకు పెనుభారమే. అది పరోక్షంగా విదేశీ ఉద్యోగులకు.. ముఖ్యంగా భారతీయులకు నష్టం చేకూర్చనుంది. కంపెనీల అవసరాలు తీర్చేలా అత్యధిక ప్రతిభాపాటవాలు ఉంటే తప్ప హెచ్–1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం పొందడం దుర్లభమేనని అంటున్నారు.